అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kalvakuntla Kavitha | పార్టీ ఏర్పాటుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె గురువారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి (Yadadri Sri Lakshmi Narasimha Swamy) వారిని దర్శించుకున్నారు.
కవిత ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు ‘జనం బాట’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ యాత్ర విజయవంతం కావాలని ఆమె ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తాజాగా యాదగిరి గుట్టలో ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25న తన సొంత ఊరు నిజామాబాద్ (Nizamabad) నుంచి ‘జనం బాట’ కార్యక్రమం ప్రారంభిస్తానని ఆమె తెలిపారు. 33 జిల్లాల్లో 4 నెలల పాటు ఈ యాత్ర సాగుతుందన్నారు. ఒక్కో జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు ఉండి అక్కడి సమస్యలు తెలుసుకుంటామని చెప్పారు. మేధావులు, విద్యావంతులు, రైతులు, యువత, మహిళలు ఇలా అన్ని వర్గాలను కలుస్తామని తెలిపారు.
Kalvakuntla Kavitha | ప్రజలు కోరుకుంటే పార్టీ
ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ (political party) పెడతానని కవిత అన్నారు. పార్టీ పెడితే తనకు కాదని.. ప్రజలకు మేలు జరగాలన్నారు. జాగృతి ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక పోరాటాలు చేశామని ఆమె గుర్తు చేశారు. పార్టీ లేకున్నా.. ప్రజా సమస్యలపై పోరాడతామని స్పష్టం చేశారు. రాజకీయాల గురించి తెలంగాణ జాగృతి తరఫున మాట్లాడాలంటే రాజకీయ పార్టీగానే ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తమిళనాడు, కేరళలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని చెప్పారు. జాగృతిని పార్టీగా మార్చడం కష్టమైన పనికాదని ఆమె పేర్కొన్నారు. యాదగిరి గుట్టను కేసీఆర్ (KCR) అభివృద్ధి చేశారన్నారు. ఆలయ విశిష్టతను కాపాడాలని సీఎం రేవంత్‌రెడ్డిని (CM Revanth Reddy) ఆమె కోరారు.
