అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kavitha | తెలంగాణ సాయుధ పోరాటమంటే మతపరమైన పోరాటం కాదని తెలంగాణ జాగృతి వ్యవస్థాకురాలు కవిత అన్నారు. జమీందార్లకు, జాగిర్దార్లకు జరిగిన వ్యతిరేక పోరాటమని, కాంగ్రెస్, బీజేపీ చరిత్ర వక్రీకరిస్తున్నాయని మండిపడ్డారు.
సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినోత్సవంగా పేర్కొంటూ హైదరాబాద్(Hyderabad)లోని జాగృతి కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం నాడు సాయుధ పోరాటంలో పాల్గొన్న పలువురిని సన్మానించారు. ఈ సందర్భంగా కవిత(Kavitha) మాట్లాడుతూ, బీజేపీ, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
Kavitha | అరాచకాలకు ఎదురుతిరిగి..
నాటి పాలకులు చేస్తున్న ఆగడాలు, అరాచకాలకు తిరిగి తెలంగాణ(Telangana) ప్రజలు ఏకతాటిపైకి వచ్చి తిరగబడ్డారన్నారు.ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులు, ప్రజలు.. దొరలకు వ్యతిరేకంగా ఎదురు తిరిగారని గుర్తు చేశారు. 1942లో జరిగిన సాయుధ తెలంగాణ పోరాటంపై విదేశాల్లో పాఠాలుగా చెప్పుకుంటున్నారన్నారు. ఆ పోరాట పటిమతోనే తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు.
Kavitha | ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలి..
అరాచక పాలన ఎవరు చేసినా ప్రజలు ఊరుకోరని తెలంగాణలో జరిగిన ఉద్యమాలే అందుకు నిదర్శనమని కవిత అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని కాంగ్రెస్(Congress), బీజేపీ ప్రభుత్వాలు విస్మరించి ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నాయని విమర్శించారు. అలా చేస్తే ప్రజలు తిరగబడతారన్నారు. బీజేపీ(BJP) చరిత్రను వక్రీకరిస్తోందని, తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్లిం పోరాటంగా చూపిస్తున్నారన్నారు. కానీ, నాడు జరిగింది దొరల, భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా జరిగిన విప్లవమని చెప్పారు.
Kavitha | మిగతా రాష్ట్రాల్లోకి ఎందుకు చేయరు?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి రాష్ట్ర చరిత్రను వక్రీకరించేలా తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహించడం ఏమిటని కవిత ప్రశ్నించారు. దీనిపై మనమంతా మనం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మూడేళ్ల క్రితం సరిగా సెప్టెంబర్‌లో వచ్చి తెలంగాణ విమోచన పోరాటం అని కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారని, మరీ మిగతా రాష్ట్రాల్లో ఇలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కేవలం తెలంగాణలో మాత్రమే ఇలా ఎందుకు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని ప్రశ్నించారు.
Kavitha | రాష్ట్రం ఎందుకు ప్రశ్నించదు..?
కేంద్ర ప్రభుత్వం(Central Government) రాష్ట్రంలోకి వచ్చి విమోచన దినోత్సవాలు నిర్వహిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించదని కవిత నిలదీశారు. ఇలా చేయొద్దని ప్రభుత్వం కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదన్నారు. మోదీతో అవగాహన లేకుంటే ముఖ్యమంత్రి వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. 2023లో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం(Telangana Liberation Day) చేస్తామని ముఖ్యమంత్రులందరినీ పిలిస్తే కేసీఆర్ నిరసన తెలిపారన్నారు. ఈ కార్యక్రమానికి తాము రామని, ఇలా చేయడం ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకమని స్పష్టం చేశారన్నారు. దానికి కౌంటర్‌గా అప్పటి ప్రభుత్వం నేషనల్ ఇంటిగ్రేషన్ డే గా నిర్వహించారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ శుద్ధపూసలా తప్పడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మేమే తెలంగాణను భారత్‌లో కలిపినమని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ అన్నారని, కానీ, నిజాం ప్రభువు స్వయంగా తాము భారత్‌లో విలీనమవుతున్నామని ప్రకటన చేశారన్నారు. మరీ కాంగ్రెస్ ఎలా విలీనం చేస్తుందని ప్రశ్నించారు. నాడు సైన్యం అరాచకాల్లో హిందు, ముస్లింలు చాలా మంది చనిపోయారు. ఇండియా సైన్యం వచ్చిన బాటను దండుబాటుగా ఇప్పటికీ పల్లెల్లో పిలుచుకుంటారన్నరని గుర్తు చేశారు. ఆనాడు తెలంగాణ పోరాటంలో పాల్గొన్న ఎంకే మొయినుద్దీన్‌ను సన్మానం చేశామన్నారు. దొరలకు వ్యతిరేకంగా చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ దేశభక్తిని చాటుకునే రోజు ఇదని, తెలంగాణ విలీన దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.