Mahila Congress President
Mahila Congress President | జంతర్ మంతర్ ధర్నాకు కవిత రావాలి : సునీత రావు

అక్షరటుడే, కామారెడ్డి: Mahila Congress President | బీసీల కోసం కొట్లాడాలనుకుంటున్న కవితకు (MLC Kavitha) చిత్తశుద్ధి ఉంటే జంతర్ మంతర్ వద్ద తాము చేపట్టబోయే ధర్నాలో పాల్గొనాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు (State Mahila Congress President Sunitha Rao) అన్నారు. ఢిల్లీలో నిర్వహించనున్న ధర్నాలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడాలన్నారు. మహిళా కాంగ్రెస్ అధ్యకురాలిగా ధర్నాకు తాను ఆహ్వానిస్తున్నానని తెలిపారు. జై బాపు, జైబీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె కామారెడ్డిలో పర్యటించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి కాంగ్రెస్ కార్యాలయం వరకు పాదయాత్రగా చేరుకున్నారు.

పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సునీత రావు మాట్లాడారు. కేసీఆర్ ఇంట్లో కుంపటి మొదలైందన్నారు. వాళ్లలో వాళ్లకే ఐక్యత లేదని, ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియదన్నారు. బీసీలకు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. రూ. వందల కోట్ల లిక్కర్ స్కాంలో దోచుకుని దుబాయ్​లో విల్లాలు కొనుగోలు చేసిందని ఆరోపించారు. తెలంగాణను వాళ్లు ఏ విధంగా దోచుకున్నారో అందరికీ తెలుసన్నారు. బీసీల గురించి కవిత మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. బీసీలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత చేసేదేమీ లేదని విమర్శించారు. వెంటనే ఈ డ్రామాలు బంద్ చేయాలన్నారు.

Mahila Congress President | కవిత పార్టీ పెట్టినా..

ఎమ్మెల్సీ కవిత పార్టీ పెట్టినా పెద్దగా వెలగబెట్టేది ఏమి లేదని సునీత రావు ఎద్దేవా చేశారు. ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో కనీసం డిపాజిట్ అయినా దక్కుతుందన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కవితను నిజామాబాద్ ప్రజలు ఎందుకు ఓడించారో గుర్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 51 శాతం ఉన్న మహిళలకు, 51 శాతం ఉన్న బీసీలకు ఎంత పెద్దపీట వేస్తారో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్, కులగణన (BC reservation and caste census) చేస్తే కడుపు మంటతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత డ్రామాలు ఎవరు పట్టించుకోరని, ఆమె మాటలు ఎవరు నమ్మరన్నారు.

Mahila Congress President | బీజేపీ మతతత్వ రాజకీయాలు

బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తోందని సునీత రావు ఆరోపించారు. ముస్లింలను పక్కకు తొలగించాలని బీజేపీ చూస్తుందని, వాళ్లు మనుషులు కాదా అని ప్రశ్నించారు. కులగణనను అడ్డుకునేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్ర రావు (BJP state president Ramchandra Rao) మాట్లాడుతున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్​లు అగ్రకులాల వారికి ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. బీసీలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ మాత్రమేనని తెలిపారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన విజయశాంతికి సముచిత స్థానం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని హరిజన వాడాలో పాదయాత్ర చేపట్టారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పాక జ్ఞానేశ్వరి, జిల్లా నాయకులు పాల్గొన్నారు.