అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLC Kavitha | బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకునే కుట్రలో భాగంగానే తనను సస్పెండ్ చేశారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్‌కు గురైన కవిత జూబ్లీహిల్స్‌లోని జాగృతి కార్యాలయం(Jagruti Office)లో బుధవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao), సంతోష్‌రావు(Santosh Rao) బీఆర్ఎస్ను హస్తగతం చేసుకునే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వారు తనపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇదే పరిస్థితి రానున్న రోజుల్లో కేటీఆర్‌కు, కేసీఆర్‌కు వస్తుందని హెచ్చరించారు. హరీశ్‌రావు, రేవంత్‌రెడ్డి ఒక విమానంలో కలిసి ప్రయాణించిన తర్వాత తమ కుటుంబాన్ని విడగొట్టడానికి కుట్రలు ప్రారంభం అయ్యాయన్నారు.
MLC Kavitha | పార్టీ కోసమే పనిచేశా
తన మీద అక్రమ కేసులు పెట్టి ఐదున్నర నెలలు తీహార్ జైలులో పెట్టారన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత విద్యార్థులు, బీసీ రిజర్వేషన్ల(BC Reservations) కోసం, కాంగ్రెస్ హామీలు అమలు చేయాలని ఉద్యమాలు చేశామన్నారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి 2024 నవంబర్ నుంచి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు చేపట్టానన్నారు. అయితే పార్టీలో ఉన్న కొందరు తనపై అక్రమ ప్రచారాలు చేశారన్నారు.
MLC Kavitha | పదవికి రాజీనామా..
ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సామాజిక తెలంగాణ కోసం తాను కట్టుబడి ఉన్నట్లు ప్రకటన చేయడంపై తప్పేం ఉందన్నారు. తన తండ్రి, కేసీఆర్(KCR) స్ఫూర్తితోనే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడనన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కేసీఆర్ పని చేశారన్నారు. హరీశ్‌రావు, సంతోష్‌రావు తనపై తప్పుడు ప్రచారం చేశారని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి సామాజిక తెలంగాణ అవసరం లేదా అని ప్రశ్నించారు. హరీశ్‌రావు, సంతోష్‌రావు ఇంట్లో బంగారం ఉంటే.. బంగారు తెలంగాణ కాదన్నారు.
MLC Kavitha | కేటీఆర్ పట్టించుకోలేదు
తనపై కుట్రలు జరుగుతున్నాయని గతంలో పార్టీ ఆఫీసులో మాట్లాడనని కవిత తెలిపారు. అయితే తన అన్న కేటీఆర్(KTR) దాని గురించి మాట్లాడలేదన్నారు. 103 రోజులు అయిన ఆ విషయం గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనీసం ఫోన్ చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుమార్తె అయిన తన గురించి పట్టించుకోకపోతే.. పార్టీలోని మిగతా మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
MLC Kavitha | మాది రక్త సంబంధం
కేసీఆర్, కేటీఆర్, తనది రక్త సంబంధం అని కవిత అన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తమ బంధం పోదన్నారు. అయితే కొందరు వ్యక్తులు తాము కలిసి ఉండకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. “మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని” ఆమె కేసీఆర్‌ను కోరారు.
MLC Kavitha | హరీశ్‌రావు, రేవంత్‌రెడ్డి కలిసిపోయారు
హరీశ్‌రావు, రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) కలిసిపోయారని కవిత ఆరోపించారు. కాళేశ్వరం నిర్మాణం సమయంలో మంత్రి ఎవరని ఆమె ప్రశ్నించారు. ఈ విషయం రేవంత్‌రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సీఎం మాజీ మంత్రి హరీశ్‌రావు గురించి మాట్లాడటం లేదన్నారు.
హరీశ్‌రావు, సంతోష్ రావు కేసీఆర్ మంచి కోరుకునే వారు కదన్నారు. వారిని దూరం పెట్టాలని ఆమె కేటీఆర్‌కు సూచించారు. హరీశ్‌రావు, సంతోష్ రావు అవినీతితో కేసీఆర్‌పై సీబీఐ విచారణ వచ్చిందన్నారు.
ప్రారంభంలో బీఆర్ఎస్ పార్టీపై హరీశ్‌రావుకు నమ్మకం లేదన్నారు. ఆయన ఆది నుంచి పార్టీలో లేదన్నారు. పార్టీ పెట్టిన 9, 10 నెలలకు ఆయన బీఆర్ఎస్లో చేరరన్నారు. ఆయన ట్రబుల్ షూటర్ కాదని, ఆయనే ట్రబుల్ క్రియేట్ చేస్తారన్నారు. అనంతరం దానిని సాల్వ్ చేసినట్లు యాక్ట్ చేస్తారన్నారు. హరీశ్‌రావు ఓ పక్క కాంగ్రెస్‌తో, మరోవైపు బీజేపీతో టచ్‌లో ఉన్నారన్నారు.
MLC Kavitha | 25 మంది ఎమ్మెల్యేలకు ఫండింగ్
హరీశ్‌రావు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఫండ్ కాకుండా.. పలువురు అభ్యర్థులకు హరీశ్‌రావు సొంతంగా ఫండింగ్ చేశారన్నారు. కాళేశ్వరంలో సంపాదించిన అవినీతి సొమ్ముతో ఫండింగ్ చేశారని ఆరోపించారు. ఒక వేళ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే.. తన పక్కన ఎమ్మెల్యేలు ఉండాలని ఇలా చేశారన్నారు. 2009 ఎన్నికల్లో సిరిసిల్లలో కేటీఆర్‌ను ఓడగొట్టడానికి హరీశ్‌రావు యత్నించారన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సైతం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలను మేనేజ్ చేశారన్నారు.
MLC Kavitha | సంతోష్‌రావు చెడగొట్టే రకం
సంతోష్‌రావు చెడగొట్టే రకం అని కవిత అన్నారు. నేరేళ్ల దళితులపై థర్డ్ డిగ్రీకి కారణం ఆయనే ఆరోపించారు. సంతోష్‌రావు ధన దాహానికి కేటీఆర్‌కు చెడ్డ పేరు వచ్చిందన్నారు. కేసీఆర్ హరితహారం కార్యక్రమం ప్రారంభిస్తే.. సంతోష్ రావు గ్రీన్ ఛాలెంజ్ పేరిట అడవులను ఆక్రమించే యత్నం చేశారన్నారు. మేఘా కంపెనీ, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కలిసి మోకిలో రూ.750 కోట్ల విల్లా ప్రాజెక్ట్ చేపట్టారన్నారు. దీని వెనుక సంతోష్‌రావు ఉన్నారని ఆరోపించారు.
MLC Kavitha | వారిని నమ్మొద్దు
సంతోష్‌రావు, హరీశ్‌రావు బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. నిజామాబాద్‌లో తన ఓటమిలో కుట్ర చేశారన్నారు. కామారెడ్డిలో కేసీఆర్‌ను సైతం ఓడగొట్టరన్నారు. మూడో సారి పార్టీ ఓడిపోవడానికి వీరే కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారితో సీఎం రేవంత్ రెడ్డికి ఒప్పందం ఉండటంతోనే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. వారిని నమ్మి మోసపోవద్దని ఆమె కేసీఆర్, కేటీఆర్‌ను కోరారు.