అక్షరటుడే, కామారెడ్డి : Kavitha Janam Bata | కుట్ర చేసి తనను కుటుంబం నుంచి బయటకు పంపించారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. తెలంగాణ ప్రజలే తనకు మరొక కుటుంబమని పేర్కొన్నారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆమె కామారెడ్డి పట్టణంలోని (Kamareddy town) అమృత్ గ్రాండ్ హోటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
తనను కుటుంబం నుంచి దూరం చేసే కుట్రలో భాగంగానే పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని, అందుకు బాధగా ఉందన్నారు. సస్పెండ్ చేయించిన వారు శునకానందం పొందవచ్చని, తనకు మరో కుటుంబం అనుకునే తెలంగాణ కోసం పనిచేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. తాను జైల్లో ఉన్నప్పుడు తన పిల్లల కన్నా కూడా అమ్మ ఆరోగ్యం గురించే ఎక్కువ బాధపడ్డాన్నారు. కామారెడ్డికి చాలా ప్రత్యేకత ఉందని, ఇక్కడ నుంచే కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ (BC declaration) ప్రకటించిందన్నారు. అదే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీసీలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని విమర్శించారు. బీసీలకు ఏటా రూ.20 వేల కోట్లతో బడ్జెట్ పెడతామని చెప్పారన్నారు. మొదటి ఏడాదిలో బీసీలకు రూ.9 వేల కోట్లే బడ్జెట్ పెట్టి అందులో సగం మాత్రమే ఖర్చు చేశారన్నారు.
Kavitha Janam Bata | కామారెడ్డిపై శీతకన్ను
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కామారెడ్డి నుంచి కూడా పోటీ చేశారని కవిత గుర్తు చేశారు. కొడంగల్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆయన కామారెడ్డిపై శీతకన్ను పెట్టారని విమర్శించారు. కామారెడ్డి జిల్లాలో (Kamareddy district) ఆగస్ట్ 27, 28 తేదీలలో వరదలు వచ్చి 94 వేల ఎకరాలలో పంట నష్టం వాటిల్లిందన్నారు. ఎంతో నష్టం జరిగితే 400 ఇళ్లకు 11 వేల చొప్పున తక్షణ సహాయం అందించి అటువైపు కన్నెత్తి చూడలేదన్నారు.
Kavitha Janam Bata | పాపం షబ్బీర్ అలీ
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీపై (Shabbir Ali) కవిత సెటైర్లు వేశారు. పాపం షబ్బీర్ అలీ అని సంబోదిస్తూ.. ఆయన గెలిచినప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉండదని, ఒడినప్పుడు అధికారంలోకి వస్తుందన్నారు. ఒడిపోయినా గెలిచిన వారిని టార్చర్ చేస్తారన్నారు. ఇక్కడ గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేను ఏ కార్యక్రమానికి రానివ్వడం లేదని, ఎంపీలు, మంత్రులకు తీసుకువచ్చి షబ్బీర్ అలీనే ప్రారంభోత్సవాలు చేస్తున్నారని విమర్శించారు. కామారెడ్డి వరదలకు కారణమైన వాళ్ళు మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్నారని, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరారన్నారు.
Kavitha Janam Bata | జాయింట్ కిల్లర్ ఏం సాధించారు
ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే తాజా, మాజీ సీఎంలను ఓడించి జాయింట్ కిల్లర్‌గా చరిత్ర సృష్టించారని కవిత అన్నారు. అంతే తప్ప ఆయన ఏం సాధించారని ప్రశ్నించారు. మేము అంతా ఇంతా అని చెప్పే బీజేపీ ఇక్కడ వరదలు వస్తే పరేడ్ చూసినట్టు చూసి వెళ్లిపోయారని విమర్శించారు. గుజరాత్లో వరదలు వస్తే వందల కోట్లు ఇచ్చారని, ఎన్నికలలో బీహార్‌కు కోట్లు కుమ్మరించారని, కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యేనే ఉన్నాడు కదా.. ఇక్కడి ప్రజల బాధ మీకు పట్టదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం మీద యుద్ధం చేయాల్సిన ఎమ్మెల్యే ఎందుకు కాంప్రమైజ్ అయ్యారని ప్రశ్నించారు.
Kavitha Janam Bata | కాళేశ్వరంతో చుక్క నీరు రాలేదు
కాళేశ్వరం ప్రాజెక్టుతో (Kaleshwaram project) జిల్లాకు చుక్క నీరు రాలేదని కవిత అన్నారు. ఈ ప్రాజెక్టుతో కామారెడ్డి, ఎల్లారెడ్డితో పాటు దుబ్బాక, బాన్సువాడ, మెదక్ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వచ్చని ప్యాకేజీ 22 మొదలు పెట్టారని, ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,446 కోట్లు అయితే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.450 కోట్లు చెల్లించిందన్నారు. కాళేశ్వరంతో కామారెడ్డి జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు రాలేదన్నారు. ఈ మాట అంటే రేపటి నుంచి బీఆర్ఎస్ వాళ్లు తనపై నోరు పారేసుకుంటారన్నారు. హల్దీ వాగు నుంచి ఒక్క సీజన్లో మాత్రం నిజాంసాగర్ నింపారని, తర్వాత నాలుగేళ్లు వర్షాలతో అవసరం రాలేదన్నారు. నాగమడుగు ప్రాజెక్ట్‌ను (Nagamadugu project) పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లంచం తీసుకుంటున్నారని ఆరోపించారు.
Kavitha Janam Bata | జనంబాటకు తాత్కాలిక విరామం
ప్రజల సమస్యల పరిష్కారం కోసం జాగృతి ఆద్వర్యంలో జనంబాట కార్యక్రమం (Janambata program) నిర్వహిస్తున్నామని కవిత తెలిపారు. ఇప్పటికి 11 జిల్లాలలో పూర్తి చేశామని, మరొక 22 జిల్లాలు ఉన్నాయన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా నుంచి మిగతా జిల్లాలలో జనంబాటకు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నామన్నారు. శనివారం నుంచి హైదరాబాద్, మేడ్చల్ ప్రాంతాల్లో జనంబాట ఉంటుందని పేర్కొన్నారు.
Kavitha Janam Bata | కవిత అరెస్టుతో కార్యక్రమాలు రద్దు
జనంబాట కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి పట్టణంలో నిర్వహించాల్సిన పలు కార్యక్రమాలు కవిత అరెస్టుతో రద్దయ్యాయి. పట్టణంలో కవులతో కవిత సమావేశం నిర్వహించాల్సి ఉంది. వరదలతో ఇబ్బందులు ఎదుర్కొన్న జీఆర్ కాలనీ, కౌండిన్య కాలనీ బాధిత కుటుంబాలకు పరామర్శ, జిల్లా గ్రంథాలయ సందర్శన కార్యక్రమాలు రద్దయ్యాయి.