అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kavitha Janam Bata | తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత క్షమాపణలు చెప్పారు. హైదరాబాద్ (Hyderabad)లోని గన్‌పార్క్ వద్ద శనివారం ఉదయం ఆమె అమరులకు నివాళులర్పించారు.
తెలంగాణ జాగృతి (Telangana Jagruti) ఆధ్వర్యంలో శనివారం నుంచి జనంబాట కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నిజాబాబాద్ (Nizamabad) నుంచి ప్రారంభిస్తున్న ఈ యాత్ర నాలుగు నెలల పాటు సాగనుంది. ఈ క్రమంలో ఆమె గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అమరవీరులు, ఉద్యమకారుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పారు.
Kavitha Janam Bata | కొంతమందికే ఉద్యోగాలు..
ఉద్యమకారుల కోసం కొట్లాడలేకపోయినందుకు క్షమాపణలు చెబుతున్నా అని కవిత భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్రం కోసం 1200 మంది అమరులు అయ్యారని ఆమె చెప్పారు. అమరవీరుల కుటుంబాలకు అనుకున్న మేర న్యాయం చేయలేకపోయమన్నారు. 580 మంది కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. మిగతా వారికి న్యాయం చేయాలని గతంలో తాను పలుమార్లు అడిగినట్లు చెప్పారు. అయితే ఇంకా గట్టిగా కొట్లాడాల్సి ఉండే అని అభిప్రాయ పడ్డారు. మంత్రిగా లేకున్నా.. తాను అమరుల కోసం మాట్లాడానని, కానీ న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడనందుకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.
Kavitha Janam Bata | ప్రతి కుటుంబానికి రూ.కోటి ఇవ్వాలి
తెలంగాణ కోసం చనిపోయిన అమరవీరుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున సాయం అందించాలని కవిత (Kalvakuntla Kavitha) డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ మేరకు కృషి చేయాలని కోరారు. జనంబాటలో భాగంగా 33 జిల్లాల్లో ఉన్న అన్ని వర్గాలను కలుస్తానని ఆమె తెలిపారు. అనంతరం ఆమె హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు బయలు దేరారు. మధ్యాహ్నం ఆమె ఇందల్వాయి టోల్ గేట్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి బర్దిపూర్ మీదుగా జాగృతి కార్యాలయం వరకు బైక్ ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం నిజామాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో మాట్లాడుతారు.
Kavitha Janam Bata | బీఆర్ఎస్ను ఇరుకున పెట్టేలా..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు (Jubilee Hills by-Elections) 15 రోజుల్లో జరగనున్నాయి. మరోవైపు స్థానిక ఎన్నికలు సైతం త్వరలో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కవిత బీఆర్ఎస్ (BRS)ను ఇరుకున పెట్టేలా మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో అమరవీరులకు న్యాయం చేశామని ఆ పార్టీ చెప్పుకుంటుంది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినట్లు బీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా కేసీఆర్ కుమార్తె కవిత బీఆర్ఎస్ అమరులకు న్యాయం చేయలేదని మాట్లాడటం గమనార్హం.
