HomeతెలంగాణBRS Party | కారులో కవిత కల్లోలం.. ఎన్నికల ముందు పార్టీలో గందరగోళం

BRS Party | కారులో కవిత కల్లోలం.. ఎన్నికల ముందు పార్టీలో గందరగోళం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRS Party | బీఆర్ ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం కల్లోలం రేపుతోంది. కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల ముందర పార్టీలో జరుగుతున్న పరిణామాలు కేడర్​ను కలవరపెడుతున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ (KCR) బిడ్డ చేసిన సంచలన ఆరోపణలు గులాబీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

ఇప్పటికే అధికారం దూరమై, పది మంది ఎమ్మెల్యేలు, కీలక నేతలు వెళ్లిపోయి తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన పార్టీకి కవిత (MLC Kavitha) ఎపిసోడ్ మరింత డ్యామేజ్ చేసిందన్న వాదన వినిపిస్తోంది. కవిత వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అయితే, తాజా పరిణామాలు ఈ నెలలోనే జరుగనున్న ఎన్నికలపై ఎటువంటి ప్రభావం చూపుతాయన్న ఆందోళన బీఆర్ ఎస్ శ్రేణులను వెంటాడుతోంది.

BRS Party | కవితకు ప్రత్యేక గుర్తింపు..

గులాబీ బాస్ బిడ్డగానే కాకుండా ఉద్యమకారిణిగా, బతుకమ్మ వేడుకల నిర్వహణ ద్వారా కవిత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన తన వాగ్దాటితో, పదునైన విమర్శలతో రాజకీయాల్లో విశేషంగా రాణించారు. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మను విశ్వవ్యాప్తం చేశారు. బతుకమ్మ ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని మరింత రగిలించేలా చేశారు. బతుకమ్మ అంటేనే కవితక్క అనే స్థాయిలో ప్రచారం తీసుకొచ్చారు. తెలంగాణ జాగృతి (Telangana Jagruti) ద్వారా కేసీఆర్ పోరాటానికి అండగా నిలిచారు. అంతేకాదు, పార్టీలోనూ ఆమె కీలకంగా వ్యవహరించారు. ఉద్యమ కాలంలో, ప్రభుత్వ పాలనలో తనదైన పాత్ర పోషించారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా కీలకంగా వ్యవహరించారు. 2006 నుంచి పార్టీలో క్రియాశీలంగా మారిన కవిత ధిక్కార స్వరం వినిపించడం, ఆమెను సస్పెండ్ చేయడం బీఆర్​ఎస్​లో తీవ్ర కలవరానికి తెర లేపింది.

BRS Party | గందరగోళంలో కేడర్..

బీఆర్ ఎస్ పార్టీ (BRS Party) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దుల తనయ కవిత వ్యవహారం కొంతకాలంగా పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. రజతోత్సవ సభ తర్వాత తన తండ్రికి రాసిన లేఖ బహిర్గతమైనప్పటి నుంచి ఆమె బహిరంగంగానే పార్టీ నేతలపై విమర్శలు ఎక్కుపెట్టారు. సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని కేసీఆర్ నిర్ణయాలను తప్పుబడుతూ వ్యాఖ్యానించారు. పరోక్షంగా కేటీఆర్​పైనా విమర్శలు చేశారు.

ఇప్పుడు హరీశ్ రావు (Harish Rao), సంతోష్ రావులను (Santosh Rao) టార్గెట్ చేశారు. గత కొన్నాళ్లుగా పార్టీలో జరుగుతున్నపరిణామాలతో గులాబీ శ్రేణులు గందరగోళంలో పడిపోయాయి. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ కలిసి బీఆర్​ఎస్​నే టార్గెట్ చేస్తున్న తరుణంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం కలవరపాటుకు గురి చేస్తున్నాయి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వీటి ప్రభావం కచ్చితంగా పడుతుందని, అంతిమంగా పార్టీకి నష్టం తప్పదేమోనన్న భయాందోళన నెలకొంది.

Must Read
Related News