అక్షరటుడే, వెబ్డెస్క్ : Kavitha | బతుకమ్మ వేడుకల్లో(Bathukamma Celebrations) పాల్గొనడానికి విదేశాలకు వెళ్లిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఖతార్, మాల్టా, లండన్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.
మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టు(Shamshabad Airport)లో ఆమెకు జాగృతి నాయకులు స్వాగతం పలికారు. లండన్ (London)లో సోమవారం బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కవిత పార్టీ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తపార్టీ ఏర్పాటుపై ఇప్పటి వరకు ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అయితే ప్రజలు కోరుకుంటే తప్పకుండా పార్టీ పెడతానన్నారు. ప్రస్తుతం తెలంగాణ జాగృతి బలోపేతంపైనే దృష్టి పెట్టినట్లు చెప్పారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా తాము పని చేస్తున్నట్లు తెలిపారు.
Kavitha | ఇంకా టైం ఉంది..
అవసరం వచ్చినప్పుడు, ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతానని కవిత(Kavitha) చెప్పారు. ప్రజల్లో జీవితాల్లో మార్పు తేవడమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉందని, అప్పటి వరకు ఏం జరుగుతుందో చూడాలని ఆమె పేర్కొన్నారు. తన వెనుక ఏ జాతీయ పార్టీ లేదని కవిత స్పష్టం చేశారు. జాతీయ పార్టీల్లో చేరే ఆలోచన కూడా లేదని ఆమె చెప్పారు. కాంగ్రెస్ మునిగిపోయే పడవ అని వ్యాఖ్యానించారు.
Kavitha | కొందరిలో స్వార్థం
బీఆర్ఎస్ కోసం 20 ఏళ్లుగా కష్టపడ్డానని కవిత చెప్పారు. కొందరిలో స్వార్థం పురుడు పోసుకుందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పార్టీలో చాలా అవమానాలు జరిగాయని చెప్పారు. తన ఓటమి మొదలు అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) భారాస ఓటమి వరకు అనేక కుట్రలు జరిగాయని ఆరోపించారు. జైలు జీవితం తనలో అనేక మార్పులు తెచ్చిందని కవిత తెలిపారు.