అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kalvakuntla Kavitha | తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన భర్త అనిల్‌తో కలిసి ఆలయంలో ఆమె పూజలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, సంతోష్‌రావుపై ఆరోపణలు చేసిన తర్వాత కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతున్నారు. వివిధ అంశాలపై పోరాటాలు చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల (BC Reservations) కోసం నిర్వహించిన బంద్‌లో ఆమె తన కుమారుడితో కలిసి పాల్గొన్నారు. త్వరలో కవిత జాగృతి జనంబాట (Jagruthi Janam Bata) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు.
Kalvakuntla Kavitha | సంతోషంగా ఉంది
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని కవిత అన్నారు. ఈనెల 25 నుంచి తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు చేరువ కావడానికి ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నాలుగు నెలల పాటు సాగే జనంబాట విజయవంతం కావాలని స్వామి వారిని కోరినట్లు ఆమె తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు చెప్పారు. అనంతరం ఆమె తిరుమల హథీరామ్ భావాజీ మఠంలో బార్సీ ఉత్సవంలో భాగంగా నిర్వహించిన భోగ్ భండార్‌లో పాల్గొన్నారు. బంజారా పూజారులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రూప్ సింగ్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.