అక్షరటుడే, ఇందూరు: Kavitha Janam Bata | తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavita) ‘జనం బాట’ పట్టనున్నారు. ప్రజలు, మేధావులు, విద్యావంతులతో మమేకం కానున్నారు. అందుకోసమే జనంబాట (Janam Bata) పేరుతో సుదీర్ఘ యాత్ర చేయనున్నారు. 33 జిల్లాల్లో కొనసాగనున్న ఈ యాత్రను శనివారం నుంచి ప్రారంభించనున్నారు.
తన కార్యక్షేత్రమైన ఇందూరు గడ్డ నుంచే జనం బాట కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టనున్నారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత తన సొంత వేదిక ఏర్పాట్లలో నిమగ్నమైన కవిత.. తెలంగాణ జాగృతిని (Telangana Jagruthi) బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. అందులో భాగంగానే ఇటీవల పలు కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఇక శనివారం నుంచి జనం బాట పేరుతో జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. అక్టోబర్ 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు నాలుగు నెలల పాటు జిల్లాల పర్యటన కొనసాగనుంది.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (BRS party leader KCR) ముద్దుల తనయ కవిత తెలంగాణ ఉద్యమ సమయంలో తనదైన పోరాట పంథాతో అందరి దృష్టిని ఆకర్షించారు. తెలంగాణ జాగృతిని స్థాపించిన కవిత.. ఉద్యమ కాలం నుంచే పోరాట పంథాలో దూసుకెళ్లారు. తెలంగాణ సాంస్కృతిక వైభవమైన బతుకమ్మను ఉద్యమంలో భాగం చేసిన ఆమె.. మహిళలను సైతం స్వరాష్ట్ర పోరాటంలో భాగస్వాములను చేశారు. ఉద్యమ లక్ష్యం నెరవేరడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు బతుకమ్మను (Bathukamma) విశ్వవ్యాప్తం చేసిన ఘనత కవితకే దక్కింది.
స్వరాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన కేసీఆర్ (KCR) తనయ.. ఘన విజయం సాధించింది. ఎంపీగా ఐదేళ్లు పసుపుబోర్డు సాధన సహా వివిధ అంశాలను జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఆమె విజయం సాధించారు. 2018లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సహకరించక పోవడంతో ఆమె అనూహ్యంగా ఓడిపోయారు. ఆ తర్వాత కేసీఆర్ ఆమెను ఎమ్మెల్సీ చేశారు.
Kavitha Janam Bata | స్వతహాగా ఎదిగేందుకు..
రాజకీయ ఆకాంక్షలు మెండుగా ఉన్న కవిత.. తొలి నుంచే స్వతహాగా ఎదిగేందుకు ప్రయత్నించారు. తెలంగాణ జాగృతి స్థాపన ద్వారా తనకంటూ ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసుకున్నారు. బీఆర్ఎస్‌కు అనుబంధంగా ఉంటూనే జాగృతిని బలోపేతం చేశారు. భారీ రాజకీయ ఆకాంక్షలు ఉన్న కవిత పట్ల గులాబీ పార్టీలో వ్యతిరేకత ఏర్పడింది. అందులో భాగంగానే 2018, 2023 ఎన్నికల్లో ఆమె ఓడిపోవాల్సి వచ్చింది.
సామాజిక తెలంగాణ రాలేదని, పదేళ్లలో చేయాల్సినంత చేయలేకపోమని ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కవితను బీఆర్ఎస్ దూరం పెట్టింది. తనపై కుట్ర పన్ని పార్టీ నుంచి వెళ్లగొట్టారని ఆమె బహిరంగంగానే తన ఆవేదనను వ్యక్తం చేశారు. హరీశ్‌రావు (Harish Rao), సంతోష్‌రావులపై (Santosh Rao) తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన కవిత.. ఇక బీఆర్ఎస్‌తో నేరుగా తలపడేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే తన సొంత వేదికను ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Kavitha Janam Bata | జిల్లాలో నేటి నుంచి..
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం నుంచి ‘జనంబాట’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు 25వ తేదీకి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేశారు. ఇందులో భాగంగా కవిత.. మధ్యాహ్నం ఒంటి గంటకు జిల్లాలోని ఇందల్వాయి టోల్‌గేట్‌కు (Indalwai toll gate) చేరుకుంటారు. అక్కడ జాగృతి శ్రేణులు కవితకు స్వాగతం పలకనున్నారు. అనంతరం బర్దిపూర్లోని ఈనాడు కార్యాలయం వద్ద నుంచి బైక్‌ర్యాలీ నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు నిజామాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయం (Telangana Jagruti office) వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. సాయంత్రం 4 గంటలకు నవీపేట మండలం యంచ గ్రామంలో గోదావరి వరద ముంపు బాధితులతో సమావేశం నిర్వహించనున్నారు. 6 గంటలకు నందిపేట మండలం సీహెచ్ కొండూరులోని లక్ష్మీ నృసింహాస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు.
Kavitha Janam Bata | కేసీఆర్ ఫొటో లేకుండానే యాత్ర..
బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించేశాక కవిత జాగృతిని బలోపేతం చేశారు. వివిధ కమిటీలు వేశారు. అలాగే, సామాజిక అంశాలపై ఉద్య మాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజ కీయ పార్టీని (political party) స్థాపిస్తారన్న ప్రచారం నిత్యకృత్య మైంది. ఇదే విషయాన్ని కవిత కూడా పరోక్షంగా అంగీకరించారు. ప్రజలు కోరుకుంటే, జనాలకు మేలు జరుగుతుందంటే తప్పకుండా పార్టీ పెడతా నని యాదగిరిగుట్ట సాక్షిగా ప్రకటించారు. తెలంగాణ రాజకీయాల్లో (Telangana politics) తనదైన ముద్ర వేయాలన్న తపనతో ఉన్న కవిత.. జనం బాట పేరుతో ప్రజ ల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకోసమే శనివారం నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. అయితే, తన తండ్రి ఫొటో లేకుం డానే కవిత ఈ యాత్ర చేపట్టనుండడం విశేషం.
సామాజిక తెలంగాణ కోసమే తమ పోరాటం అని చెబుతున్న ఆమె.. తన యాత్రలో బీఆర్ఎస్పై (BRS) ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఉత్కంఠ రేపు తోంది. ఇప్పటికే హరీశ్‌రావు, సంతోష్‌రావులను విమర్శిస్తున్న ఆమె.. తదుపరి ఎవరిని టార్గెట్ చేస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది. సామాజిక తెలంగాణ కోసం ఏం చేయాలనే విషయాలను ప్రజల నుంచి తెలుసుకోవడమే లక్ష్యంగా జనం బాట చేపడుతున్నట్లు కవిత ఇటీవల ప్రకటిం చారు. ఈ క్రమంలోనే మేధావులు, విద్యావంతులు అన్ని వర్గాల ప్రజలను కలిసి మేధోమధనం చేస్తా మన్నారు. ఆ తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
