అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Karur stampede | తమిళనాడు (Tamil Nadu)లోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటి వరకు 39మంది మృతి చెందిన విషయం తెలిసిందే. సినీ హీరో, టీవీకే అధినేత విజయ్ (Vijay) నిర్వహించిన ర్యాలీలో శనివారం రాత్రి తొక్కిసలాట చోటు చేసుకుంది.
తొక్కిసలాట అనంతరం విజయ్ తీరుపై సోషల్ మీడియాలో అనేక విమర్శలు వస్తున్నాయి. విజయ్ ఆలస్యంగా రావడంతోనే తొక్కిసలాట జరిగిందని డీఎంకే (DMK) నాయకులు ఆరోపించారు. పది వేల మందికి పర్మిషన్ తీసుకొని రెండు లక్షల మందితో ర్యాలీ నిర్వహించినట్లు సమాచారం. కాగా తొక్కిసలాట జరిగాక కూడా విజయ్ తన ప్రసంగాన్ని కొనసాగించడం గమనార్హం.
Karur stampede | అక్కడి నుంచి వెళ్లిపోయిన విజయ్
విజయ్ మాట్లాడుతుండగా.. తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆయన కొద్ది సేపు ప్రసంగాన్ని ఆపేశారు. అంబులెన్స్‌లకు దారి ఇవ్వాలని ప్రజలకు సూచించారు. అనంతరం మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రజల ప్రాణాలు పోయినా పట్టించుకోకుండా ఆయన తన రాజకీయ కార్యక్రమాన్ని కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన బాధితుల గురించి ప్రస్తావించకుండా.. వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోకుండా అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లిపోయారు. అనంతరం సోషల్ మీడియా (Social Media)లో ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టారు.
Karur stampede | కేంద్ర హోంశాఖ ఆరా..
కరూర్ ఘటనలో చిన్నారులు సహా 39 మంది మృతి చెందారు. 111 మంది చనిపోయారు. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా తీసింది. తమిళనాడు ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. సీఎం స్టాలిన్, గవర్నర్‌కు అమిత్ షా (Amit Shah) ఫోన్ చేసి మాట్లాడారు.
Karur stampede | పరిహారం ప్రకటించిన టీవీకే
తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు టీవీకే పార్టీ (TVK Party) పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.20లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపింది. బాధితులకు అండగా ఉంటామని టీవీకే అధినేత విజయ్ తెలిపారు.