అక్షరటుడే, వెబ్డెస్క్ : Karthika Masam | కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. కార్తీక పురాణంలో మొదటి 15 అధ్యాయాలు శివుడి ప్రాముఖ్యతను తెలియజేస్తే.. చివరి 15 అధ్యాయాలు శ్రీమహావిష్ణువు (Sri Maha Vishnuvu) విశిష్టతను తెలియజేస్తాయి.
కార్తీక మాసం విశిష్టత గురించి స్కంద పురాణం చెబుతుంది. కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు, శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు, వేదముతో సమానమైన శాస్త్రం లేదు, గంగతో సమానమైన తీర్థం లేదు అని స్కంద పురాణం (Skanda Puranam) పేర్కొంటోంది. విశిష్టమైన కార్తీక మాసంలో ఎవరైతే పవిత్ర స్నానం ఆచరించి దీపాలు వెలిగించి శివకేశవులను భక్తిశ్రద్ధలతో పూజించి కార్తీక పురాణం చదువుతారో వారు పాపవిముక్తులు అవుతారని పురాణాలు చెబుతున్నాయి.
Karthika Masam | ఎప్పటి నుంచి ఎప్పటివరకు..
ఈనెల 21న అమావాస్యతో ఆశ్వయుజ మాసం ముగుస్తుంది. మరుసటి రోజునుంచి అంటే అక్టోబర్ 22వ తేదీన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. నవంబర్ 20 వరకు కొనసాగుతుంది. ఈ మాసమంతా నదీ స్నానాలు, పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలు తదితర కార్యక్రమాలతో అంతటా ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. శివాలయాల్లో రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహిస్తారు. తులసీ పూజలు, దీపారధన చేస్తారు.
Karthika Masam | శివారాధన..
కార్తీక మాసంలో నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం ఆచరించి, బిల్వ పత్రాలతో శివుడిని పూజించడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని భక్తులు నమ్ముతారు. ప్రదోష కాలంలో శివారాధన (Shiv Aradhana) చేస్తారు. ఇలా ప్రదోష కాలంలో శివాలయంలో పూజలు చేస్తే సకల దోషాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. అందుకే చాలా మంది శివ భక్తులు సాయంత్రం వేళ గుడిలో దీపారాధన చేస్తారు. అలాగే సోమవారాలు ఉపవాస దీక్షను ఆచరిస్తారు.
Karthika Masam | లక్ష్మీదేవి అనుగ్రహం కోసం..
దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపంలో లక్ష్మీదేవి ఉంటుందని భక్తులు నమ్ముతారు. దీపం నుంచి వెలువడే తేజస్సులో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి నిత్యం ఇంట్లో దీపారాధన (Deeparadhana) చేయడం అత్యంత శుభప్రదం. రోజూ దీపారాధన చేయడం కుదరని వారు ఈ కార్తీక మాసంలో ఆచరించినా విశేషమైన ఫలితం ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా కార్తీక శుక్ల ద్వాదశి లేదా కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వేళ ఆలయం, తులసి కోట, రావిచెట్టు, నది.. ఇలా ఏదో ఒక చోట దీపారాధన చేస్తే ఏడాది మొత్తం దీపారాధన చేసిన పుణ్యఫలం లభిస్తుందని పేర్కొంటున్నారు. అందుకే కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి పూజలు చేస్తారు. లక్ష్మీదేవి ప్రసన్నం కోసం దీపారాధన చేస్తారు. కార్తీక మాసంలో దీప దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో పవిత్ర నది లేదా ఆలయం లేదా ఇంట్లో తులసి కోట వద్ద రోజూ దీపారాదన నిర్వహిస్తారు. బ్రాహ్మణులకు దీపదానం చేస్తారు. కార్తీక పూర్ణిమ రోజును పండుగలా జరుపుకుంటారు. 365 ఒత్తులతో దీపారాధన చేస్తారు. పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలను వెలిగించి నదులు, పారే నీటిలో వదులుతారు.
Karthika Masam | దీపదానం..
కార్తీక మాసంలో మనం ఆచరించే స్నానం, జపం, తర్పణ, దానాలకు విశేషమైన పుణ్యఫలం ఉంటుంది. పవిత్రమైన కార్తీక మాసంలో శక్తిమేర నవధాన్యాలు, ఆహారం, దీపదానం, ఉసిరి దానం, వస్త్రదానం, గోదానం చేయాలని వేద పండితులు సూచిస్తారు. ఈ మాసంలో దీపాన్ని దానం చేయడం వల్ల జీవితంలో చీకటి తొలగిపోతుందని, లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.