అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bike Taxi | కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) కీలక నిర్ణయం తీసుకుంది. బైక్ ట్యాక్సీలపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తి వేసింది. ఈ మేరకు శుక్రవారం డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది.
కర్ణాటకలో బైక్ ట్యాక్సీ సేవలను నిలిపివేయాలని గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం (State Government) నియమాలను రూపొందించిన తర్వాత వాటిని అనుమతించాలని పేర్కొంది. 2025 ఏప్రిల్‌లో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వేలాది మంది ఉపాధి కోల్పోయారు. సింగిల్ జడ్జి తీర్పులపై ANI టెక్నాలజీస్ (OLA క్యాబ్‌లను కలిగి ఉన్న సంస్థ), ఉబర్, రాపిడో వంటి క్యాబ్ అగ్రిగేటర్లు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి విభు బఖ్రు, న్యాయమూర్తి CM జోషిలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది.
Bike Taxi | వాటి పరిధిలోకి వస్తాయి
బైక్ ట్యాక్సీ సేవలకు ఉపయోగించే మోటార్ సైకిళ్లు మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం “రవాణా వాహనాలు” నిర్వచనంలోకి వస్తాయని కోర్టు చెప్పింది. మోటార్ సైకిళ్లు (Motorcycles) రవాణా వాహనాలు కాదనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం అటువంటి వాహనాలకు అనుమతులను తిరస్కరించొద్దని పేర్కొంది. బైక్ ట్యాక్సీ ఆపరేటర్లు బైక్ టాక్సీలుగా మోటార్ సైకిళ్లను నడపడానికి కాంట్రాక్ట్ క్యారేజ్ పర్మిట్ (Contract Carriage Permit)లను పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అటువంటి దరఖాస్తులను పరిగణించాలని, కాంట్రాక్ట్ క్యారేజీలుగా పనిచేయడానికి అనుమతి మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే బైక్ ట్యాక్సీలను వాణిజ్య వాహనాలుగా పరిగణించాలని, పసుపు రంగు నంబర్ ప్లేట్ ఉపయోగించాలని పేర్కొంది. తాజా తీర్పుతో బైక్ ట్యాక్సీ నడిపే ఎంతో మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.