అక్షరటుడే, వెబ్డెస్క్ : karnataka | తెల్లవారు జామున ఆ రోడ్డుపై వెళ్తున్నవారికి ఏదో తేడా అనిపించింది. సాధారణంగా ఉండే వాతావరణానికి భిన్నంగా, ఏదో దుర్వాసన వస్తున్నట్టు అర్ధమైంది. ఎంతదూరం వెళ్లినా ఆ వాసన తగ్గకపోవడం ఆందోళన కలిగించింది. అదే సమయంలో ఓ కుక్క రోడ్డుపై ఓ పెద్ద మాంసం ముక్కను పట్టుకుని వస్తుండగా ఆ వాసన మరింత తీవ్రంగా మారింది. వెంటనే రోడ్డుపై ఉన్నవారు ఆ కుక్కను తరిమే ప్రయత్నం చేశారు. కానీ దాని నోటిలో ఉన్న మాంసం ముక్కని చూసి షాక్ కి గురయ్యారు. ఎందుకంటే అది మనిషి చెయ్యి. ఎవరో వ్యక్తి చేయి కట్ చేసి పడేయగా, ఆ కుక్క తీసుకెళ్లుతోందని అర్థమైంది. తక్షణమే వారు పోలీసులకు (police) సమాచారం ఇచ్చారు.
Karnataka | కిరాతకంగా..
అక్కడికి చేరుకున్న పోలీసులు, వైద్య బృందంతో కలిసి చేయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే అది ఎవరిది? మిగతా శరీరం ఎక్కడ ఉందన్నది అర్థం కాక పోలీసుల దర్యాప్తు (Police investigation) ముమ్మరం చేశారు. కొద్దిసేపట్లోనే ఒక కిలోమీటర్ దూరంలో మరో శరీర భాగం, కాలు లభించింది. అలా చూస్తూ చూస్తూ 15 కిలోమీటర్ల లోపు వివిధ ప్రాంతాల్లో పది శరీర భాగాలు దొరికాయి. దీంతో పోలీసులు మర్డర్ గా అనుమానిస్తూ దర్యాప్తు సాగించారు. ఈ దారుణాన్ని పరిశీలించిన నిపుణులు, బాధితురాలిని చంపి ముక్కలుగా చేసి, వాహనంలో వేసుకుని ఒక్కో ముక్కను వేరే వేరే చోట్ల విసిరేశారని భావిస్తున్నారు. లభ్యమైన శరీర భాగాల్లో ఉన్న పచ్చబొట్లు, ముఖ లక్షణాల ఆధారంగా బాధితురాలిని లక్ష్మీదేవమ్మ (Lakshmi Devamma) (వయస్సు 42) గా గుర్తించారు.
ఆమె కోరటగెరె తాలూకాలో నివసిస్తూ, ఆగస్టు 4 నుంచి కనిపించకుండా పోయింది. ఆమె భర్త బసవరాజు, బెళ్లవి పోలీస్ స్టేషన్‌లో (Bellavi police station) ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఆగస్టు 3న కుమార్తెను కలవడానికి వెళ్ళిన లక్ష్మీదేవమ్మ, తిరిగి ఇంటికి రాలేదు. అయితే ఆమెను 4వ తేదీన హత్య చేయలేదని, 7వ తేదీన హత్య చేసి శరీర భాగాలు విడదీసి పారేశారని నిపుణుల అభిప్రాయం. ఆమె కుమార్తె ఇంటికి అసలు వెళ్లలేదన్న విషయమూ బయటపడింది. అంటే ఆమెను కిడ్నాప్ (Kidnap) చేసి చంపారా? లేక దారి మధ్యలోనే హత్య చేశారా? అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర భయాందోళన కలిగించింది. 2022లోని శ్రద్ధా వాల్కర్ హత్య కేసుతో ఇది పోలి ఉంది.
