అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Karla Rajesh Lockup Death | కోదాడలో కర్ల రాజేష్ కుటుంబాన్ని ఎస్సీ కమిషన్ (SC Commission) సభ్యులు సోమవారం పరామర్శించారు. దళిత యువకుడు రాజేష్‌ను పోలీసులు ఓ కేసులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అనుమానాస్పద స్థితిలో అతడు మృతి చెందాడు. పోలీసులే రాజేష్‌ను చంపారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
కర్ల రాజేష్ కుటుంబాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ పరామర్శించారు. ఆయన వెంట ADGP చౌహాన్, కలెక్టర్, ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. కర్ల రాజేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కమిషన్ విచారణ చేపట్టింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) రాజేష్ మృతికి సంబంధించిన వివరాలను కమిషన్‌కు వివరించారు. పోలీసు అధికారుల నిర్లక్ష్యం, కేసును పక్కదారి పట్టించడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
Karla Rajesh Lockup Death | ఎస్సైని సస్పెండ్ చేయాలి
రాజేష్ లాకప్ డెత్ జరిగి ఇన్ని రోజులుగా అవుతున్నా చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేసినందుకు పోలీసు అధికారుల మీద రాంచందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో ఎస్సై సురేష్ రెడ్డి (SI Suresh Reddy)ని సస్పెండ్ చేయాలని, పది రోజుల్లో రీ పోస్టుమార్టం మార్టం నిర్వహించాలని ఆదేశించారు. రాజేష్ కుటుంబంలో ఒకరికి పది రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలని, డబుల్ బెడ్ రూం ఇల్లు, మూడు ఎకరాల భూమి త్వరగా ఇవ్వాలన్నారు. ఈ కేసులో వెంటనే చార్జిషీట్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషన్ ఆదేశాలను అమలు చేయకపోతే పోలీసు ఉన్నతాధికారుల మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.