అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Karimnagar BJP Mayor Victory | కరీంనగర్ (Karimnagar) మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఎక్స్ వేదికగా స్పందించారు. కరీంనగర్ మేయర్‌ను ఎన్నుకోలేదని, చరిత్ర లిఖించిందన్నారు.
నగరంలో తొలిసారిగా బీజేపీ మేయర్ ప్రమాణ స్వీకారం చేశారని ఆయన అన్నారు. మేయర్‌గా ఎన్నికైన కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుకు అభినందనలు తెలిపారు. కరీంనగర్లో 66 స్థానాలు ఉండగా.. బీజేపీ 30 చోట్ల గెలిచిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, స్వతంత్ర అభ్యర్థులు 8 మంది, ఫార్వార్డ్ బ్లాక్ నుంచి ఇద్దరు గెలిచారు. అయితే 14 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ మేయర్ పీఠం దక్కించుకోవాలని ప్లాన్ వేసింది. కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మరోవైపు బీఆర్ఎస్ ఓటింగ్‌కు దూరంగా ఉంది.
Karimnagar BJP Mayor Victory | భావోద్వేగ క్షణం
ఈ రోజు కేవలం రాజకీయ విజయం మాత్రమే కాదని, ఒక భావోద్వేగ క్షణమని బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోదీ (PM Modi) దార్శనికతపై నమ్మకం ఉంచి, అభివృద్ధిని ఎంచుకున్న ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేటర్‌గా ఉండటం నుంచి, కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగురుతున్నప్పుడు చూడటం తనకు వ్యక్తిగతమైందన్నారు. తాను ఈ ప్రయాణంలో జీవించానని పేర్కొన్నారు. కాగా గతంలో బండి సంజయ్ కార్పొరేటర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్షణం వెనుక ఉన్న పోరాటాన్ని తాను చూశానని ఆయన అన్నారు.
ఈ పోరాటానికి తమ చెమట బలాన్ని అందించిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం చెందుతుందని కేంద్ర మంత్రి అన్నారు. ఒత్తిడి, బెదిరింపులు, అవమానాలను ఎదుర్కొని బీజేపీ అభ్యర్థులు గెలిచారన్నారు. మజ్లిస్ పార్టీ కార్యాలయం ఉన్న వార్డులోనే తమ కార్యకర్తలు కాషాయ జెండాను ఎగురవేశారన్నారు.