అక్షరటుడే, వెబ్డెస్క్: Konaseema District | డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామ భీమేశ్వరాలయం (Draksharama Bhimeswara Temple)లో అపచారం చోటుచేసుకుంది. సప్తగోదావరి తీరాన ఉత్తర గోపురం సమీపంలో ఉన్న కపాలేశ్వర స్వామి (Kapaleswara Swamy) శివలింగాన్ని గుర్తుతెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు.
మంగళవారం ఉదయం ఆలయ సిబ్బంది, భక్తులు ఈ విషయాన్ని గుర్తించడంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. శివలింగంపై సుత్తి వంటి మొనదేలిన ఆయుధంతో దాడి చేసి విరగ్గొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.సమాచారం అందిన వెంటనే కాకినాడ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా (SP Rahul Meena) ఘటనా స్థలానికి చేరుకుని స్వయంగా పరిశీలించారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి ఆధారాలను సేకరించారు.
Konaseema District | మనోభావాలు దెబ్బ తీసేలా?
ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలు (CC Cameras) లేనందున, చుట్టుపక్కల ప్రాంతాల్లోని కెమెరాల ఫుటేజీని పోలీసులు జల్లెడ పడుతున్నారు. నిందితులను త్వరగా గుర్తించి అరెస్ట్ చేయడానికి ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు ఎస్పీ వెల్లడించారు.ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy)తో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్న సీఎం, బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. మంత్రి ఆనం స్పందిస్తూ, ధ్వంసం జరిగిన ప్రదేశంలో వేద పండితుల సమక్షంలో కొత్త శివలింగాన్ని పునఃప్రతిష్ఠించినట్లు తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
మరోవైపు ఈ ఘటనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (BJP State President PVN Madhav) తీవ్రంగా ఖండించారు. హిందూ ధర్మంపై దాడిగా ఈ చర్యను పేర్కొంటూ, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనతో ద్రాక్షారామ ఆలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, భక్తులు, స్థానికులు శాంతియుతంగా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.