HomeసినిమాKantara chapter 1 | కాంతార చాప్ట‌ర్ 1 మూవీ రివ్యూ.. అదే రేంజ్‌లో హిట్...

Kantara chapter 1 | కాంతార చాప్ట‌ర్ 1 మూవీ రివ్యూ.. అదే రేంజ్‌లో హిట్ కొట్టాడా..!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Kantara chapter 1 | మూడేళ్ల క్రితం ప్రేక్ష‌కుల ముందుకు ఎలాంటి అంచ‌నాలు లేకుండా వచ్చిన కాంతార మూవీ Movie ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

ఇప్పుడు ఈ మూవీకి ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్‌ 1 ని రూపొందించారు దర్శకుడు రిషబ్‌ శెట్టి Rishab Shetty. చిత్రంలో ఆయ‌నే హీరోగా న‌టించ‌గా, ఆయ‌న స‌ర‌స‌న రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటించింది.

జయరాం, గుల్జన్‌ దేవయ్య ముఖ్య పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని నేడు(అక్టోబరు 2) ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయ‌నుండ‌గా, గ‌త రాత్రి ప్రీమియ‌ర్స్ వేశారు.

మరి కాంతార మ్యాజిక్ రిపీట్ అయిందా? రిషబ్‌ శెట్టి ఈ మూవీని ఆకట్టుకునేలా తెరకెక్కించాడా అనేది ఇప్పుడు చూద్దాం.

Kantara chapter 1 | క‌థ‌..

రిషబ్ శెట్టి క్రియేట్ చేసిన మిస్టిక్ యాక్షన్ యూనివర్స్‌కి “కాంతార: ఛాప్టర్ 1” రూపంలో బలమైన ప్రీక్వెల్ రూపకల్పన జరిగింది.

కాంతార ముగింపు దగ్గర నుంచి ప్రారంభమయ్యే ఈ సినిమా కథలో హీరో దేవుడిగా ఎలా మారాడు? శివుడి తత్వం ఏమిటి? ఆయన భూమిలో మాయమయ్యే రహస్యం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానాలు రివీల్ చేస్తూ, ఓ పౌరాణిక ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తుంది.

కథ పూర్వీకుల కాలంలో, దక్షిణ కర్ణాటక Karnataka అడవుల్లో ముగిసిన మిస్టరీగా సాగుతుంది. మూడు తెగల మధ్య కాంతార తెగ అత్యంత శక్తివంతమైనది. వారి నాయకుడు బర్మె (రిషబ్ శెట్టి)లో దైవ శ‌క్తి ఉండ‌డంతో దానిని పింజ‌ర్ల తెగ త‌మ వ‌శం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది.

రాజు విజయేంద్ర అడవిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తాడు, కానీ శివుడి ఆగ్రహానికి బలైపోతాడు. దీంతో అతని కుమారుడు రాజశేఖరుడు (జయరాం) బాధ్యతలు తీసుకుంటాడు.

తర్వాతి తరంగా కులశేఖరుడు (గుల్షన్ దేవయ్య) పెద్దవాడవుతాడు. కానీ రాజ్యం నిర్వహించే సత్తా ఉన్నవాడు కాదు. అతని బాధ్యతలను కూతురు కనకవతి (రుక్మిణి వసంత్) తీసుకుంటుంది.

అడవిలోని ఒక భాగం శివ పూదోట – ఒక దివ్య స్థలం. ఎవరు అక్కడికి వెళ్తే వారు తిరిగి రారు. కానీ వ్యాపార, అధికారం కోరికతో బంగ్రా రాజ్యం ఈ ప్రాంతంపై కన్నేస్తుంది.

కనకవతి, కులశేఖరుడు ఇందులో ప్రవేశించాలనుకుంటారు. కానీ ఆ శివతత్త్వం వారిని అడ్డుకుంటుంది. ఈ క్రమంలో కనకవతి – బర్మె మధ్య సంబంధం ఏర్పడుతుంది. ప్రేమలో పడతారు.

వారి తెగ కూడా అడవి ద్రవ్యాలతో వ్యాపారంలో దిగుతుంది. కానీ ఈ చర్యలు కులశేఖరుడికి నచ్చవు. అడవిలోకి సైన్యంతో ప్రవేశించి, కాంతార జనాన్ని హింసించి చంపేస్తాడు.

అప్పుడే అసలు దేవుడి ఆవిర్భావం ప్రారంభమవుతుంది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది ఏంటి అనేది తెరపై చూడాల్సిందే.

Kantara chapter 1 | న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్:

ఇందులో ప్రధాన పాత్రధారి బర్మెగా నటించిన రిషబ్ శెట్టి తన నటనతో వాహ్ అనిపించేలా చేశారు. ఈసారి కథలో రొమాన్స్, లవ్ ట్రాక్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు హీరోయిజాన్ని బాగా చూపించారు.

రిషబ్ తన క్యారెక్టర్‌లో ఒదిగిపోయి, యాక్షన్ సీన్లలో మాత్రం దుమ్ములేపే స్టైల్‌తో మెప్పించారు. అయితే అతనిలోకి దైవం ప్రవేశించే సీన్లు మాత్రం ‘కాంతార’ మొదటి భాగం స్థాయికి రాలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

యువరాణి కనకవతిగా నటించిన రుక్మిణి వసంత్ బలమైన పాత్రలో కనిపించి సప్రైజ్ ఇచ్చారు. ఆమె పాత్రకు ఉన్న ఎమోషనల్ డెప్త్‌, టర్న్ మరియు క్లైమాక్స్ లో ఇచ్చిన హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఆమె పాత్ర సినిమాకు మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్‌గా నిలిచింది. ఇక రాజశేఖరుడిగా జయరాం సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించగా, కులశేఖరుడిగా గుల్షన్ దేవయ్య నటన పరంగా ఒదిగిపోయారు.

కానీ ఆయన పాత్రే ఆడియెన్స్‌ను కొంతవరకు ఇరిటేట్ చేసేలా రూపొందించబడింది. నెగెటివ్ షేడ్స్, అహంకార ధోరణితో ముందుకెళ్లే క్యారెక్టర్ కావడంతో ఆయనపై ద్వేషం కలిగించేలా నటించారు, అదే ఆయనకు సక్సెస్ అని చెప్పొచ్చు.

మిగిలిన పాత్రల్లో నటించినవారు కూడా తమ స్థాయిలో పరిపూర్ణంగా నటించారు. ముఖ్యంగా కాంతార తెగ సభ్యులుగా కనిపించిన వారు, స్థానిక భాషలు, నైజాలు, ప్రవర్తనలతో పాత్రలను జీవించినట్లు అనిపించింది. ప్రతి ఒక్కరూ సినిమా కోసం నిజంగా ప్రాణం పెట్టారని చెప్పొచ్చు.

Kantara chapter 1 | టెక్నిక‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్:

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘కాంతార 2’ టెక్నికల్ పరంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. హాలీవుడ్ రేంజ్‌లో చిత్రీకరణ, రాజుల కాలం నాటి ఆర్ట్ వర్క్, విజువల్స్ అన్నీ అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి.

కెమెరామెన్ అరవింద్ కే కశ్యప్ అందించిన విజువల్స్ సినిమాకే ప్రధాన బలంగా నిలిచాయి. కెమెరా పనితనం ఒక్కటే సినిమాని ఒక స్థాయిలో నిలబెట్టినట్టు అనిపిస్తుంది.

అయితే ఎడిటింగ్ విషయంలో సురేష్ మలయ్య కొంత మెరుగుపడాల్సిన అవసరం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. కొన్ని సీన్లు ట్రిమ్ చేయవలసిన అవసరం ఉన్నా – అవి అలాగే ఉంచడం వల్ల ప్రేక్షకులకి ఓ స్థాయి తర్వాత నిడివి భారంగా మారుతుంది.

సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ ఈసారి సంగీతం పరంగా అంతగా మెప్పించలేకపోయారు. ‘కాంతార’ మొదటి భాగంలో సంగీతం ఎంత బలంగా నిలిచిందో, ఈసారి అంత స్థాయికి చేరుకోలేకపోయింది.

నిర్మాణ విలువల విషయానికి వస్తే మాత్రం ఎక్కడా రాజీ పడలేదు. సినిమా చాలా రిచ్‌గా, గ్రాండ్‌గా రూపొందించబడింది. కాస్ట్యూమ్స్, సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ కలిపి ఒక పౌరాణిక, మిస్టిక్ ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉన్నాయి.

దర్శకుడు రిషబ్ శెట్టి తన స్థాయిలో బెస్ట్ ఇచ్చారు. ఆయన సినిమా కోసం ఎంతగా కష్టపడ్డారో ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది. పాత్రలో ఒదిగిపోవడం మాత్రమే కాదు, దర్శకత్వం పరంగా తీసుకున్న శ్రమ స్పష్టంగా అర్థమవుతుంది.

ప్ల‌స్ పాయింట్:

  • క్లైమాక్స్ ఎపిసోడ్
  • యాక్ష‌న్ ఎపిసోడ్స్
  • ల‌వ్ ట్రాక్
  • ఇంట‌ర్వెల్ ఫైట్

మైన‌స్ పాయింట్స్:

  • కొన్ని భావోద్వేగాలు మిస్
  • కుల శేఖ‌రుడి ఎపిసోడ్
  • ఫ‌స్టాఫ్ సాగ‌దీయ‌డం
  • సెకండాఫ్ ప్ర‌తీకారం సీన్స్

విశ్లేషణ:

కథనాన్ని మలచడంలో కాస్త వెన‌క‌ప‌డ్డారు అనే చెప్పాలి. చెప్పాల్సిన విషయం చిన్నదే అయినా, దాన్ని రెండు గంటల 30 నిమిషాల పాటు సాగదీసే ప్రయత్నంలో అనవసరమైన సీన్లను కలిపినట్టుగా అనిపించింది.

కొన్ని సీన్లు అసలు సంబంధం లేనివిగా, మరికొన్ని కథకు అవసరం లేనివిగా ఉన్నా – వాటిని తొలగించకుండా వదిలేయడం వల్ల సినిమా పేస్ స్లో అయిపోయింది.

భావోద్వేగాల కంటే హంగులు, ఆర్భాటాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు దర్శకుడు చూపించిన దృష్టికోణం కొంతమేర నెగటివ్ పాయింట్‌గా నిలిచింది. అయితే క్లైమాక్స్ మాత్రం బాగా డిజైన్ చేశారు. చివరి 20 నిమిషాల్లో సినిమాకి కావలసిన గ్రిప్ తిరిగి వచ్చింది.

మొత్తంగా చూస్తే ‘కాంతార 2’ ఒక విజువల్ అద్భుతం. టెక్నికల్‌గా అత్యున్నతంగా రూపొందించబడింది. నటీనటుల ప్రదర్శన, సాంకేతిక నైపుణ్యం, విజువల్స్ అన్నింటిలోనూ రిషబ్ శెట్టి తన స్థాయిలో బెస్ట్ ఇచ్చారు. కానీ కథనం పరంగా ప్రేక్షకులను పూర్తిగా ఎంగేజ్ చేయలేకపోయింది.

సినిమా ఒక గొప్ప ఆలోచనతో మొదలై, గొప్పగా రూపుదిద్దుకున్నా మిడ్ సెక్షన్ లో కాస్త ప‌ట్టు త‌ప్పింది. అయినా కూడా రిషబ్ శెట్టి ధైర్యంగా తన దృష్టిని తెరపై చూపించడం, పెద్ద స్కేల్ లో కథను చెప్పాలన్న ప్రయత్నం ప్రశంసించదగ్గదే.

రాజు మత్తులో పోవ‌డం, ఆయనొక జోకర్‌గా ఎస్లాబ్లిష్‌ చేయడం మెయిన్‌గా చూపించారు. ఇంటర్వెల్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌తో గూస్‌ బంమ్స్ తెప్పించారు. మొత్తంగా ఇది కాంతార‌ని మించి అయితే లేదు అని చెప్పాలి.

రేటింగ్ : 2.75/ 5

  • నటులు:రిషబ్ శెట్టి,రుక్మిణి వసంత్,జయరామన్,గుల్షన్ దేవయ్య
  • సినిమా శైలి: డ్రామా, యాక్ష‌న్
  • దర్శకుడు:రిషబ్ శెట్టి
  • వ్యవధి:2 Hrs 45 Min
  • సంగీతం: అజనీష్ లోక్‌నాథ్