HomeసినిమాKantara Chapter 1 | 'కాంతార చాప్టర్ 1' తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్.. తొలి...

Kantara Chapter 1 | ‘కాంతార చాప్టర్ 1’ తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్.. తొలి రోజు క‌లెక్ష‌న్స్ ఎంత అంటే..!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kantara Chapter 1 | రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార చాప్టర్ 1’ సినిమా గాంధీ జయంతి (అక్టోబర్ 2) మరియు విజయదశమి పండుగ కానుకగా వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైంది. ఇది ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

కాంతార సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో, ప్రీక్వెల్‌ సినిమా పై ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేకించి తెలుగులో మంచి హైప్ ఏర్పడింది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు కలిసి దాదాపు రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

Kantara Chapter 1 | రెస్పాన్స్ అదిరింది..

రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆయనకు జోడీగా రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా, జయరాం, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా, అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫీ, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది.

ఫిలింనగర్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, కాంతార చాప్టర్ 1కు (Kantara Chapter 1) తెలుగు థియేట్రికల్ రైట్స్ రూ.100 కోట్లకు పైగా పలికాయి. ఇందులో నైజాం ఏరియాలో రూ.40 కోట్లు, ఆంధ్రలో రూ.45 కోట్లు, సీడెడ్ ఏరియాలో రూ.15 కోట్లు చెల్లించినట్లు సమాచారం. దీంతో కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.101 కోట్ల షేర్ లేదా రూ.202 కోట్ల గ్రాస్‌గా నిర్ధారించబడింది.

ఇక ఇతర ప్రాంతాల్లో కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలో థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. కర్ణాటకలో ఈ సినిమా హక్కులు ₹169 కోట్లకు, తమిళనాడులో రూ.13 కోట్లకు, కేరళలో రూ.20 కోట్లకు, నార్త్ ఇండియాలో రూ.96 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ.44.5 కోట్లకు అమ్ముడయ్యాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారు రూ.440 కోట్ల విలువైన ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా లాభాల బాటలోకి రావాలంటే దాదాపు రూ.850 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అవసరమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే, కాంతార చాప్టర్ 1కు వరల్డ్ వైడ్‌గా పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా రూ.43.87 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమాలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది. భాషల వారీగా చూస్తే, హిందీలో రూ.22 కోట్లు, కర్ణాటకలో రూ.15 కోట్లు, తమిళంలో రూ.3 కోట్లు, మలయాళంలో రూ.3 కోట్లు వసూలయ్యాయి.

ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా కాంతార చాప్టర్ 1 మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. నార్త్ అమెరికాలో మాత్రమే ప్రీమియర్స్‌తో కలిపి 750k డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.6 కోట్లు వసూలయ్యాయి. న్యూజిలాండ్, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ వంటి ఇతర ప్రాంతాల్లో కలిపి రూ.3 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. మొత్తంగా ఓవర్సీస్‌లో తొలి రోజు రూ.10 కోట్ల గ్రాస్ వసూలైంది. తెలుగు రాష్ట్రాల్లో కాంతార చాప్టర్ 1కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ప్రీమియర్స్‌కు అభిమానులు అధికంగా హాజరయ్యారు. ట్రేడ్ సమాచారం ప్రకారం, నైజాం మరియు ఆంధ్రా సహా సీడెడ్ ఏరియాలో కలిపి తొలి రోజు ఈ సినిమా దాదాపు రూ.12 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వీకెండ్ సమయంలో సినిమా మరింత బలంగా నిలుస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.