అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rescue team rescued | రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాత్రిపగలు అనే తేడా లేకుండా కుండపోతగా కురుస్తున్నాయి.
వరుసగా కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల పలు జిల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద చేరి, ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
వాగులు, వంకలు, నదులు పొంగిపోర్లుతున్నాయి. రహదారులపై ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా ప్రజా రవాణా సౌకర్యాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
రైల్వే ట్రాక్‌లు కొట్టుకుపోవడంతో పలు రైళ్లు సైతం రద్దయ్యాయి. రహదారులు కొట్టుకుపోవడంతో వాహనాలు సైతం రాకపోకలు సాగించలేని దుస్థితి ఉంది.
ఉమ్మడి మెదక్ జిల్లా Medak district లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంజీరకు వరద పోటెత్తింది. మరోవైపు పసుపు వాగు కూడా ఉగ్రరూపం దాల్చింది.
అటు కామారెడ్డిలోనూ భారీ వరదలకు పోచారం ప్రాజెక్టు.. జలాశయం ఎత్తుకు 8 అడుగుల ఎత్తు మీదుగా పొంగి ప్రవహించింది. ఫలితంగా నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో జలాశయం 24 గేట్లు కూడా ఎత్తివేశారు.
నిజాంసాగర్ గేట్లు పూర్తిగా ఎత్తేయడంతో ఉగ్రరూపం మంజీర Manjira River, పసుపు వాగు Pasupu Vagu (Haldi River).. కందకుర్తి వద్ద గోదావరిలో కలిసిపోయి మహోగ్రరూపంగా మారాయి.
కందకుర్తి వద్ద భారీగా వరద పోటెత్తడంతో గోదావరి మీదుగా మహారాష్ట్ర – తెలంగాణ మధ్య రవాణా సౌకర్యం కలిపే వంతెన నీట మునిగిపోయింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని వాహనాలను దారి మళ్లించారు.
Rescue team rescued : సాయం కోసం ఆర్తనాదాలు..
ఇక కందకుర్తి వద్ద గోదావరి ఒడ్డున ఉన్న ఆశ్రమం జల దిగ్బంధంలోకి వెళ్లిపోయింది. దీంతో అందులో ఉన్న 8 మంది భక్తులు చిక్కుకుపోయి, సహాయం కోసం ఆర్తించారు.
గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న బోధన్ రూరల్ సీఐ విజయ్‌బాబు ఆధ్వర్యంలో రెస్యూ బృందం ఘటనా స్థలికి చేరుకుంది.
వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో సాయం అందించడం కష్టంగా మారింది. అయినా పోలీసులు రిస్క్ తీసుకున్నారు. కొన్ని గంటల పాటు శ్రమించి బోట్ల సాయంతో చివరికి భక్తులకు సురక్షితంగా రక్షించారు పోలీసులు.
Rescue team rescued : మరిన్ని వర్షాలు..
రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.