అక్షరటుడే, వెబ్‌డెస్క్: Himachal Pradesh | ఇటీవల కురిసిన వర్షాలకు అంతటా కూడా వాగులు, వంకలు ఎలా పొంగిపొర్లుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఈ వరదల వలన కొన్ని చోట్ల బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో (Mandi District) కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి. వాగులు ఉప్పొంగాయి.
ఈ క్రమంలో ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. వాగులు దాటి వెళ్లి తమ విధులు నిర్వర్తించడానికి కొందరు అధికారులు జంకారు. అయితే హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) మండి జిల్లాలో ఆరోగ్య కార్యకర్త కమలాదేవి తన డ్యూటీ విషయంలో ఏమాత్రం వెనుకంజ వేయలేదు. ఆరోగ్య శాఖకు చెందిన ఆమె, ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకువెళ్తున్న మిషన్ ఇంద్రధనుష్ (Mission Indradhanush) కార్యక్రమంలో భాగంగా, పిల్లలకు టీకాలు వేసేందుకు బయలుదేరింది.
Himachal Pradesh | పెద్ద రిస్కే..
వీధులు లేని దారుల్లో, నదుల్ని వాగుల్ని దాటి, మట్టిబాటలపై నడుస్తూ, చెట్లు, రాళ్ల మధ్య దూకుతూ, తన మెడికల్ కిట్‌ను (Medical Kit) చేతిలో పట్టుకొని, చిన్నారుల ఆరోగ్యం కోసం ఆమె సాగించిన ఈ ప్రయాణం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు కళ్ల ముందు కనిపిస్తుండగా, మధ్యలో కొన్ని బండరాళ్ల పైనుండి జంప్ చేస్తూ అవతలి వైపునకు చేరుకుంది. గ్రామానికి వెళ్లి చిన్నారులకు టీకాలు (Vaccines) వేయాలని కమలాదేవి ఇంత సాహసం చేయడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. ఇది చూసి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
ఈ వీడియోపై సోషల్ మీడియాలో వేలాది మంది స్పందిస్తున్నారు. ఒక దేవతలాంటి మహిళ, అవార్డుల కన్నా అభినందనలే తగినవి, “ప్రభుత్వ ఉద్యోగం అంటే ఇలాంటిదే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కమలాదేవి సేవకు ప్రభుత్వ అధికారులు సైతం స్పందించారు. మండి జిల్లా హెల్త్ డిపార్ట్‌మెంట్ (Health Department) ఆమెను ప్రత్యేకంగా అభినందించింది. “వీడియోలో కనిపించిన సాహసానికి మేమంతా గర్వపడుతున్నాం” అంటూ హిమాచల్ ఆరోగ్య శాఖ ట్వీట్ చేసింది. ఆమెకు పురస్కారం ప్రకటించే అవకాశాలున్నాయని సమాచారం. ప్రస్తుత కాలంలో ఎక్కడైనా కాస్త వర్షం పడితే స్కూళ్లు మూసేస్తారు, ఉద్యోగులు సెలవులు తీసుకుంటారు. కానీ కమలాదేవిలాంటి వాళ్లు దేశాన్ని ముందుకు తీసుకెళ్లే అసలైన వీరులు. వారిని గుర్తించడం, స్ఫూర్తిగా తీసుకోవడం మన బాధ్యత అని ప్రశంసలు కురిపిస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లాలో ఆరోగ్య కార్యకర్త కమలాదేవి అద్భుత సాహసం!
వాగు దాటి, బండరాళ్లపై దూకుతూ హురాంగ్ గ్రామానికి చేరుకుని చిన్నారులకు టీకాలు వేసింది.
చిన్నారులకు టీకాలు వేయడానికి ఆమె చేసిన ధైర్యానికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు pic.twitter.com/yVFCyOAUiK
— greatandhra (@greatandhranews) August 23, 2025