అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Education Demand | ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తులపై ఆరోపణలు మానుకుని కళాశాల స్థలాల్లో విద్యాసంస్థల ఏర్పాటుకు నాయకులు కృషి చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Government Degree College) వద్ద విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు.
Kamareddy Education Demand | రాజకీయ నాయకులు కృషి చేయాలి
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల పరిరక్షణ కోసం రాజకీయ నాయకులు కృషి చేయాలన్నారు. కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్‌గా (Education Hub) మార్చేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. అరోరా ఇంజినీరింగ్ కళాశాల, సరస్వతి శిశు మందిర్ పాఠశాల, కర్షక్ బీఈడీ కళాశాలకు నాడు స్థలాలను ఎలా కేటాయించారని ప్రశ్నించారు. అలాగే అక్రమంగా స్థలాలను కబ్జా చేసుకుని కట్టడాలు చేసినా ఎందుకు అడ్డుకోలేదని నిలదీశారు. అరోరా కళాశాల, సరస్వతి శిశు మందిర్, కర్షక్ బీఈడీ కళాశాలల (Karshak B.Ed College) భవనాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ విద్యాసంస్థలను స్థాపించాలని డిమాండ్ చేశారు. కళాశాల ఆస్తుల విషయంలో రాజకీయాలు చేసే అర్హత ఎవరికీ లేదన్నారు.
Kamareddy Education Demand | కళాశాల ఆస్తులను కాపాడింది విద్యార్థి సంఘాలే..
కళాశాల ఆస్తులను కాపాడడం కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడింది విద్యార్థి సంఘాలు (Student Unions) మాత్రమేనని నాయకులు పేర్కొన్నారు. విద్యావసరాల కోసం రైతుల వద్ద నుంచి సేకరించిన డిగ్రీ కళాశాల భూమిలో ఇతరులకు కేటాయించిన సమయంలో ప్రశ్నించకుండా రాజకీయ నాయకులు అప్పుడు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ఇకనైనా ఆరోపణలు మానుకుని విద్యార్థుల భవిష్యత్తుకు బాసటగా నిలవాలని సూచించారు. మహిళా డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్, కేంద్రీయ విద్యాలయం, నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగాలన్నారు. కళాశాల ఆస్తుల పరిరక్షణ కోసం విద్యార్థి సంఘాలు ఏకమై జేఏసీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ, టీఎన్ఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, బీవీఎం, జీవీఎస్, బీసీ, టీజేఎస్, విద్యార్థి సంఘాల నాయకులు అరుణ్, బాలు, సురేష్, విఠల్, వినోద్, లక్ష్మణ్, బులెట్, సురేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
