అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Political Tension | కామారెడ్డిలో హైటెన్షన్ నెలకొంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (Government Degree College) ఆస్తుల విషయంలో చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకులు సవాల్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాను చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి (MLA KVR) ప్రకటించడంతో ఉద్రిక్తత నెలకొంది.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల అంశం చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆస్తుల విషయంలో ఇటీవల కాంగ్రెస్ నాయకులు (Congress Leaders) ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. దీనిపై చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే చెప్పడంతో కామారెడ్డిలో హై టెన్షన్ నెలకొంది. శనివారం ఉదయం నుంచే పోలీసులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, సరస్వతి శిశుమందిర్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. కళాశాల వద్ద బందోబస్తును జిల్లా అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు.
Kamareddy Political Tension | కాంగ్రెస్ నాయకుల అరెస్ట్
కాంగ్రెస్ నాయకులు భారీ సంఖ్యలో కళాశాల గ్రౌండ్ వద్దకు చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి డీసీఎం వ్యానుల్లో పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం (MLA Camp Office) వద్ద పోలీసులు బందోబస్తు చేపట్టారు. దాంతో ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేశారని ప్రచారం సాగినా అదంతా ఏమి లేదని పోలీసులు తెలిపారు. క్యాంప్ కార్యాలయం వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
Kamareddy Political Tension | కార్యకర్తలు ఎవరు రావొద్దు
కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలు తన కుటుంబానికి సబంధించినవి అని, ఇది పూర్తిగా తన వ్యక్తిగతమని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి తెలిపారు. కార్యకర్తలు ఎవరు కూడా కామారెడ్డికి రావద్దని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్యకర్తలు ఎవరు రారని పోలీసులకు తాను మాట ఇచ్చానని, తన మాటకు విలువ ఇచ్చి ఎవరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవద్దని కోరారు. తన కుటుంబంపై చేసిన ఆరోపణలు నిజం కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
ఆధారాలతో వచ్చినం.. ఎమ్మెల్యే ఎక్కడ
ఎమ్మెల్యే సవాల్ ప్రకారం సరస్వతి శిశుమందిర్ పాఠశాలకు ఆధారాలతో సహా వచ్చామని, ఎమ్మెల్యే ఎక్కడున్నాడని ఎన్ఎస్యూఐ (NSUI) జిల్లా అధ్యక్షుడు సందీప్ ప్రశ్నించారు. కళాశాల భూములను ఎమ్మెల్యే రమణారెడ్డి అరోరా కాలేజీకి ధారాదత్తం చేశారని ఆరోపించారు. ఆధారాలతో వచ్చి నిరూపించాలని సవాల్ చేసిన ఎమ్మెల్యే తోక ముడిచారని విమర్శించారు. కళాశాల గ్రౌండ్ వద్దకు చేరుకున్న సందీప్, కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

