అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Political Tension | ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి (MLA Venkata Ramana Reddy)పై ఆరోపణల నేపథ్యంలో కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత నాలుగైదు రోజులుగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా రాజకీయాలు సాగగా శనివారం పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి.
తనపై వచ్చిన ఆరోపణలను తానే నిరూపించుకుంటానని ఎమ్మెల్యే ప్రకటించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున కళాశాల గ్రౌండుకు చేరుకోగా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల సూచనతో క్యాంప్ కార్యాలయం (Camp Office)లోనే ఎమ్మెల్యే ఉండడంతో పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, అతడిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు మహేందర్ రెడ్డి కారును ఎత్తి పడేసి నిప్పంటించారు. ఈ క్రమంలో కామారెడ్డిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
దాంతో ఎమ్మెల్యే కేవీఆర్ (MLA KVR)కు మద్దతుగా బీజేపీ అధిష్టానం కామారెడ్డికి రానున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ యేలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కామారెడ్డి (Kamareddy)కి రానున్నట్టుగా తెలుస్తోంది. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓ వైపు బాన్సువాడలో ఉద్రిక్త పరిస్థితులు, కామారెడ్డిలో టెన్షన్ వాతావరణ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు కామారెడ్డికి వస్తారా.. రారా అనేది సస్పెన్స్‌గా మారింది.