అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kamareddy Police | కామారెడ్డి జిల్లాలో పోలీసులు దొంగ బండ్లను విక్రయించుకున్న ఉదంతం తాజాగా వెలుగుచూసింది. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బైకు దొంగతనాలకు సంబంధించిన ఓ కేసు నమోదైనట్లు సమాచారం.
వివిధ ప్రాంతాల నుంచి దొంగతనం చేసిన 29 టూ వీలర్లను అప్పటి సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రికవరీ చేశారు. ఇందులో కొన్ని టెంపరరీ రిజిస్ట్రేషన్లు, నంబరు ప్లేట్లు లేని వాహనాలుగా గుర్తించారు. వీటిలో కొన్నింటిని సేఫ్ కస్టడీ నిమిత్తం కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఉంచారు. కాగా.. గతంలో పనిచేసిన ఓ అధికారి, మరో కానిస్టేబుల్ కలిసి ఆ టూ వీలర్లను అమ్ముకున్నట్లు బయటపడిందని సమాచారం.
Kamareddy Police | తనిఖీల్లో బయటపడ్డ వైనం..
తాజాగా.. కామారెడ్డి పట్టణ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా గతంలోనే పోలీసులకు దొరికిన (దొంగతనం చేయబడిన బండి) టూ వీలర్‌ను ఓ వ్యక్తి నడుపుతుండగా సీజ్ చేశారు. చేసిస్ నంబర్ ఆధారంగా పూర్తి వివరాలు రాబట్టగా మైలార్ దేవునిపల్లికి చెందిన వారిదిగా గుర్తించినట్లు తెలిసింది. కాగా.. సదరు వాహనం చోరీకి గురైందని.. అనంతరం కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లోనే రికవరీ చేసినట్లు సమాచారం.
అయితే సదరు వాహన యజమానికి ఇప్పటి వరకు బండి అందలేదని తెలిసింది. మరోవైపు పోలీస్ స్టేషన్ నుంచే కామారెడ్డి పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు మెకానిక్కు వాహనాన్నివిక్రయించినట్లు తెలుస్తోంది. అప్పటి ఎస్‌హెచ్‌వోకు తెలిసే ఈ తంతు జరిగినట్లు సమాచారం. ఏదేమైనా దొంగతనాలకు గురైన వాహనాలను రికవరీ చేసి, బాధితులకు తిరిగి ఇవ్వాల్సిన పోలీసులే.. వాటిని దొడ్డిదారిలో విక్రయించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
