Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | ఖాకీల అక్రమాల పర్వం.. ఆ నేత సోదరుడి అండదండలు..

Kamareddy | ఖాకీల అక్రమాల పర్వం.. ఆ నేత సోదరుడి అండదండలు..

కామారెడ్డి నియోజకవర్గంలో కొందరు పోలీసు అధికారులు అక్రమాల పర్వానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ఓ నేత సోదరుడు వారికి అండదండగా నిలుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Kamareddy | కామారెడ్డి జిల్లా పోలీస్​ శాఖలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, సిబ్బంది పట్ల ఎస్పీ రాజేష్​ చంద్ర కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఏ చిన్న ఆరోపణలు వచ్చినా సత్వరమే విచారణ జరిపించి బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సీఐలు, ఎస్సైలు, సిబ్బందిపై సస్పెన్షన్​తో పాటు బదిలీ వేటు వేశారు. దీంతో అధికారులు, సిబ్బంది తీరులో చాలా వరకు మార్పు కనిపించింది. కానీ కామారెడ్డి నియోజకవర్గం పరిధిలో పనిచేస్తున్న పలువురు అధికారులు ఏ మాత్రం మారడం లేదని తెలుస్తోంది.

నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం పనిచేస్తున్న సీఐలు, ఎస్సైలలో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా కూడా అధికార కాంగ్రెస్​కు చెందిన మైనారిటీ నేత ద్వారా పోస్టింగ్​లు దక్కించున్న వారే. కాగా.. సదరు మైనారిటీ నేత సోదరుడి కనుసన్నల్లోనే నియోజకవర్గంలో సీఐ, ఎస్సైలు పనిచేస్తున్నారు. ముఖ్యంగా కొందరు తమ పరిధిని దాటి అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారు. కాగా.. ఫిర్యాదులు, ఆరోపణలు వచ్చిన ప్రతిసారి సదరు నేత జోక్యం చేసుకుని ఎలాంటి చర్యలు లేకుండా చూస్తున్నారనే ప్రచారంలో ఉంది. ఇదే కారణంతో గతంలో కామారెడ్డి పట్టణ సీఐగా పనిచేసిన అధికారిపై తీవ్ర ఆరోపణలు వచ్చినప్పటికీ ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. సివిల్​ సెటిల్​మెంట్లు, తగాదాలను ఠాణాల్లోనే పరిష్కరించి పెద్దమొత్తంలోనే దండుకున్నట్లు అప్పటి అధికారిపై ఆరోపణలు వచ్చాయి. ఇదే తరహాలో ప్రస్తుతం పనిచేస్తున్న ఒకరిద్దరు అధికారులు సైతం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. క్రమశిక్షణను మరిచి సొంతంగా ఫాంహౌస్​లు నిర్మించుకుని వాటిల్లోనే సెటిల్​మెంట్లు, అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

Kamareddy | విచారణ షురూ.. చర్యలుంటాయా..?

తాజాగా ఓ ఇన్​స్పెక్టర్​పై వచ్చిన ఆరోపణల విషయంలో పోలీసు ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. ‘అక్షరటుడే’లో వచ్చిన కథనం ఆధారంగా ఎంక్వైయిరీ మొదలుపెట్టారు. సదరు సీఐపై వచ్చిన ఆరోపణలపై కామారెడ్డి సబ్​ డివిజన్​ ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆరా తీస్తున్నారు. మరో వైపు ఇంటలిజెన్స్​ అధికారులు సైతం సదరు ఇన్​స్పెక్టర్​ అడ్డగోలు వసూళ్లు, ఫాంహౌస్​ వ్యవహారంపై ఆరా తీసి నివేదిక పంపినట్లు సమాచారం. ఒకవైపు పోలీస్​బాస్​ క్రమశిక్షణ మరిచిన వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంటే.. కిందిస్థాయి అధికారులు మాత్రం అధికార పార్టీ నేతల అండదండలు చూసుకుని బాధ్యతారహితంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. నేతల అండ చూసుకొని పోలీస్​ శాఖకు మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే తదుపరి ఇతర అధికారులు తప్పిదానికి పాల్పడరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Must Read
Related News