అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి పెద్ద చెరువు (Kamareddy Pedda Cheruvu) ఉధృతంగా ప్రవహిస్తోంది. చెరువు అలుగు నిండి ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో చెరువు అందాలను వీక్షించేందుకు సందర్శకులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. చెరువు వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో చెరువు నీటిలోకి వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. దూరం నుంచి మాత్రమే చెరువును వీక్షించేందుకు పోలీసులు అనుమతినిస్తున్నారు. చెరువు నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్ అధికారులు చెరువును పరిశీలించారు. ప్రజలు చెరువు లోపలికి వెళ్లవద్దని సూచించారు.
Kamareddy | అధికారులు అప్రమత్తం
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పోలీస్ శాఖ ప్రజలకు జాగ్రత్తలు సూచించింది. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (District SP Rajesh Chandra) ఎప్పటికప్పుడు పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) సైతం పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులను అలర్ట్గా ఉండాలని ఆదేశించారు. కామారెడ్డి మండలం గర్గుల్ నుంచి కన్నాపూర్ వెళ్లే దారిలోని వాగు నిండిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాంతో ఆ దారిని పోలీసులు మూసివేశారు. రామారెడ్డి గంగమ్మ వాగును ఎస్పీ ఇప్పటికే పరిశీలించి ప్రజలకు జాగ్రత్తలు సూచించారు.