అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Municipality Congress | కామారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
కామారెడ్డిలో 32-35 స్థానాల్లో గెలిచి ఛైర్పర్సన్ పీఠాన్ని ఒంటరిగానే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని అన్నారు. కామారెడ్డిలో అభివృద్ధి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఐదేళ్లు ప్రతిపక్షం, పదేళ్లు అధికారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మున్సిపాలిటీ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యేగా రమణారెడ్డి (Ramanareddy) వచ్చాక అభివృద్ధి చేస్తారని ఎంతో ఆశించామని, రెండేళ్లుగా కనబడని ఎమ్మెల్యే ప్రస్తుతం ఎన్నికల సమయంలో వచ్చి మాట్లాడుతున్నారన్నారు. కామారెడ్డిలో వరదలు వస్తే ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే రాలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ఎమ్మెల్సీల బృందం వరద ప్రాంతాల్లో పర్యటించారని గుర్తు చేశారు.
Kamareddy Municipality Congress | రూ.200 కోట్లు మంజూరు
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలతో ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై పూర్తి నమ్మకం ఏర్పడిందని షబ్బీర్ అలీ అన్నారు. సొంత ప్రాంతంలో అభివృద్ధి చేయాలని తాను సీఎంకు రూ.200 కోట్ల ప్రతిపాదనలు పంపితే మంజూరు చేశారని చెప్పారు. రూ.8 కోట్లతో ఇండోర్ స్టేడియం పనులకు శంకుస్థాపన చేశామన్నారు. కామారెడ్డి పట్టణానికి తాగునీటి సమస్య పరిష్కారం కోసం 4 ఎంఎల్డీ ఉన్న నీటి సరఫరాను 10 ఎంఎల్డీకి మార్చామన్నారు. ఫలితంగా 20 ఏళ్ల వరకు పట్టణంలో నీటి ఇబ్బందులు రాకుండా ఉంటాయన్నారు.
ఈ సమావేశంలో ఎన్నికల ఇన్ఛార్జి, మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నెరేళ్ల శారద, డీసీసీ మాజీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.