అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Municipal Polling | కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections) ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు అరకొరగా ఓటర్లతో ప్రారంభమైన పోలింగ్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉండటంతో ఓటర్లు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు.
Kamareddy Municipal Polling | జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో..
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో 1,49,525 మంది ఓటర్లు ఉండగా ఉదయం 9 గంటల వరకు 8,970 మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకోగా కేవలం 6శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. కామారెడ్డి మున్సిపాలిటీలో 99,313 మంది ఓటర్లకు 3,662 మంది ఓటు వేయగా 3.69 శాతం, ఎల్లారెడ్డిలో 13,265 మంది ఓటర్లకు 1,182 మంది ఓటుహక్కు వినియోగించుకోగా 8.91 శాతం, బాన్సువాడలో 24,188 మంది ఓటర్లకు 2,296 మంది ఓటుహక్కు వినియోగించుకోగా 9.49 శాతం, బిచ్కుంద మున్సిపాలిటీలో 12,789 మంది ఓటర్లకు 1,830 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోగా 14.34 పోలింగ్ శాతం నమోదైంది.
Kamareddy Municipal Polling | బిచ్కుంద మున్సిపాలిటీలో అత్యధికంగా..
నాలుగు మున్సిపాలిటీలలో బిచ్కుంద మున్సిపాలిటీ (Bichkunda Municipality)లో అత్యధికంగా 14.34 పోలింగ్ నమోదు కాగా ఆత్యల్పంగా కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) లో కేవలం 3.69 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఓటర్లను పోలింగ్ బూత్‌లకు తీసుకురావడానికి కౌన్సిలర్ అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. తొందరగా వచ్చి ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు. అభ్యర్థుల అనుచరులు ప్రత్యేక ఆటోల్లో ఓటర్లను పోలింగ్ బూత్‌లకు తరలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో (Polling Centers) అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓటరు జాబితా, ఓటరు స్లిప్పులతో సిబ్బందికి కేంద్రాలలో నియమించారు. వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేకంగా వీల్ చైర్లు అందుబాటులో ఉంచారు.
Kamareddy Municipal Polling | ఛైర్మన్ పీఠం మాదే.. ఎమ్మెల్యే కేవీఆర్
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలువురు నాయకులు పోలింగ్ కేంద్రాలలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి బతుకమ్మ కుంటలోని 54 వ పోలింగ్ బూత్‌లో ఉదయం 8 గంటలకు తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కామారెడ్డి మున్సిపాలిటీలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుని చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోబోతుందన్నారు.
Kamareddy Municipal Polling | ఓటు వేసిన షబ్బీర్ అలీ..
గంజ్ పాఠశాలలోని ఉదయం 10 గంటలకు 150వ పోలింగ్ బూత్‌లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కామారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో పడబోతుందన్నారు. పట్టణంలోని లిమ్రా గార్డెన్ సమీపంలో 55 పోలింగ్ బూత్‌లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రతిఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు.
