అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy mla Camp office | కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే కళాశాల వద్ద కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే ఎమ్మెల్యే సూచన మేరకు కార్యకర్తలు ఎవరూ క్యాంప్ కార్యాలయం (Camp Office) వైపు రాలేదు. అయినా క్యాంప్ కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పోసానిపేట మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గీరెడ్డి మహేందర్ రెడ్డి (Gireddy Mahender Reddy) పోలీసుల కళ్లుగప్పి తన కారులో క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకుని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. క్యాంప్ ఆఫీసుకు కాంగ్రెస్ నాయకుడు రావడంపై బీజేపీ కార్యకర్తలు (BJP Leaders), నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేందర్ రెడ్డి కారు అద్దాలను ధ్వంసం చేశారు. దాంతో పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. దాంతో షబ్బీర్ అలీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోలీసులను తోసుకుంటూ వెళ్లి కారును ఎత్తి పడేశారు. దాంతో స్వల్పంగా లాఠీఛార్జ్ చేసి కార్యకర్తలను చెదరగొట్టారు. ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy) క్యాంప్ కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాసేపటికి పోలీసులు కారును టోచన్ సహాయంతో తరలించేందుకు ప్రయత్నించగా కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు.
మహేందర్ రెడ్డి ఇక్కడికి రావాలని, క్యాంప్ కార్యాలయానికి ఎందుకు వచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో మరోసారి పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకోగా కొందరు కార్యకర్తలు మహేందర్ రెడ్డి కారుకు నిప్పుపెట్టారు. దాంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు కార్యకర్తలను పక్కకు తరలించి నీళ్లతో మంటలను ఆర్పివేసి కారును తరలించారు. ఈ క్రమంలో ఓ బీజేపీ కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేయగా ఎమ్మెల్యే రమణారెడ్డి బయటకు వచ్చి అరెస్ట్ చేసిన తమ కార్యకర్తను పంపించాలని పోలీసులకు సూచించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసులను భారీగా మోహరించారు.
Kamareddy mla Camp office | పోలీసుల కళ్లుగప్పి ఎలా వస్తాడు..: బీజేపీ నాయకులు
ఎమ్మెల్యే సూచన మేరకు తాము శాంతియుతంగా ఎలాంటి ఆందోళన చేయకుండా ఉన్నామని బీజేపీ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు పోలీసుల కళ్లుగప్పి క్యాంప్ కార్యాలయానికి ఎలా వస్తాడని ప్రశ్నించారు. ఇది కచ్చితంగా పోలీసుల నిఘా వైఫల్యమేనని ఆరోపించారు. కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి (Councilor Sridhar Reddy) మాట్లాడుతూ.. క్యాంప్ కార్యాలయం వద్దకు వచ్చిన మహేందర్ రెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే ఇచ్చిన పిలుపును స్వాగతించాడని, ఎమ్మెల్యే సూపర్ అంటూ మెసేజ్ చేశాడని తెలిపారు. ఇప్పుడు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం విడ్డురంగా ఉందన్నారు.
