అక్షరటుడే, కామారెడ్డి : Republic Day | కామారెడ్డి జిల్లా (Kamareddy District) ప్రగతి పథంలో ముందంజలో ఉందని అదనపు కలెక్టర్ విక్టర్ (Additional Collector Victor) అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఓపెన్ టాప్ జీప్‌లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పోలీస్ పరేడ్‌ను తిలకించారు.
అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పారదర్శకంగా పాలన నడిచే ఉద్దేశ్యంతో ప్రజాపాలన కార్యక్రమాన్ని మొదలు పెట్టిందని అదనపు కలెక్టర్ అన్నారు. జిల్లాలో గత వానాకాలంలో పండిన 4,57,101 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి రూ.1,092 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 1,98,159 మంది రైతులు రైతు బీమాకు అర్హత కలిగి ఉన్నారని, గత ఏడాది చనిపోయిన 554 మంది రైతుల కుటుంబాలకు రూ.27.70 కోట్లు ఖాతాలో జమచేయడం జరిగిందన్నారు. జిల్లాలో 2,07,423 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.100.41 కోట్ల బోనస్ చెల్లించడం జరిగిందని పేర్కొన్నారు.
Republic Day | మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో..
మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో 4,23,247 క్వింటాళ్ల మొక్కజొన్నను 21 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల (Farmers) నుంచి కొనుగోలు చేసి రూ.32.98 కోట్లు రైతుల ఖాతాలో జమచేశామన్నారు. 9 కొనుగోలు కేంద్రాల ద్వారా 61,870 క్వింటాళ్ల సోయాబీన్ కొనుగోలు చేసి రూ.15.23 కోట్లు, 13,062 మెట్రిక్ టన్నుల పత్తిని సేకరించి సీసీఐకి విక్రయించడం జరిగిందన్నారు. ఇప్పటివరకు రూ.104 కోట్లు రైతులకు చెల్లించామన్నారు. జిల్లాలో 2,93,241 రేషన్ కార్డుల ద్వారా నెలకు 6,322 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతుందన్నారు.
Republic Day | మహాలక్ష్మి పథకంలో..
మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 1,51,342 మంది లబ్ధిదారులకు 5,58,981 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామని చెప్పారు. దీనికోసం ప్రభుత్వం రూ.16.05 కోట్ల సబ్సిడీ అందించిందన్నారు. ఈ ఏడాదిలో బ్యాంకు లింకేజీ ద్వారా 9,199 మహిళా సంఘాలకు రూ.727.30 కోట్లు, స్త్రీనిధి-సహకార బ్యాంకు ద్వారా 8,129 మంది సభ్యులకు రూ.80.14 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఉచిత బస్సు పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 6.42 కోట్ల మంది ప్రయాణించారన్నారు. తద్వారా మహిళలకు రూ.203.98 కోట్ల లబ్ది చేకూరిందని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలు నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.24.97 కోట్లు ఖర్చు చేస్తుందని, జిల్లాలో 11,142 మంది విద్యార్థులకు రూ.7.57 కోట్ల ఉపకార వేతనం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
Republic Day | గృహజ్యోతి పథకం ద్వారా..
గృహజ్యోతి పథకం (Gruha Jyothi Scheme) ద్వారా 1,70,328 మంది వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందుతుందని తెలిపారు. జిల్లాలో ఇందిరమ్మ పథకం ద్వారా 12,072 ఇండ్లు మంజూరు కాగా 9,401 ఇండ్ల నిర్మాణం ప్రారంభం అయిందని, 2,419 ఇళ్లు బేస్మిట్ లెవల్, 977 ఇళ్లు గోడల వరకు, 2746 ఇళ్లు స్లాబ్ లెవల్ వరకు పనులు జరగగా 106 ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు లబ్ధిదారులకు రూ.131.32 కోట్లు జమ చేశామని చెప్పారు.
Republic Day | పర్యాటర రంగం అభివృద్ధికి కృషి..
జిల్లాలో పర్యాటక రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, పోచారం రిజర్వాయర్, లింగంపేట నాగన్నబావిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం రూ.5 కోట్లు మంజురు చేసిందని అదనపు కలెక్టర్ తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఎకో టూరిజం అభివృద్ధి కోసం రూ.9.97 కోట్లు మంజూరు చేసిందన్నారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా కుటుంబ పెద్దను కోల్పోయిన అర్హులైన కుటుంబానికి ప్రభుత్వ రూ.20వేలు పరిహారం అందిస్తుందని, జిల్లాలో అర్హులైన 524 కుటుంబాలకు రూ. 1.40 కోట్లు మంజూరు కోసం సెర్ఫ్ సీఈవోకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ఇప్పటివరకు 462 మంది లబ్ధిదారులకు రూ.92.40 లక్షలు ఖాతాలో చేమ చేసినట్లు వెల్లడించారు.
Republic Day | రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్ అలైవ్..
రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం (‘Arrive Alive’ Program) ద్వారా రోడ్డు భద్రతపై పోలీసు శాఖ అవగాహన కల్పిస్తోందని ఆయన అన్నారు. ‘కిడ్స్ విత్ ఖాకీ’ అనే వినూత్న కార్యక్రమం ద్వారా వివిధ పాఠశాలల నుంచి 160 మంది విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. నేర రహిత జిల్లాగా మార్చడానికి పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, అగ్నిమాపక శకటాలను ప్రదర్శించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్సీసీ విద్యార్థులు ఇటీవల జరిగిన వరదల నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బంది చర్యలను ప్రదర్శించారు. అలాగే బీబీపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గ్యాస్, పెట్రోల్ ఆయిల్ ప్రమాదాల నివారణపై ప్రత్యేక ప్రదర్శన చేపట్టారు. అనంతరం జిల్లాలోని ఉత్తమ అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధు మోహన్, ఎస్పీ రాజేష్ చంద్ర, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, ఆర్డీవో వీణ ఇతర అధికారులు పాల్గొన్నారు.