అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy House Burglary | రాత్రి, పగలు తేడా లేకుండా దొంగలు రెచ్చిపోతున్నారు. శివారు కాలనీల్లో రెక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా తాళం వేసిన ఇంట్లో చొరబడి 16 తులాల బంగారం, 3 తులాల వెండి, రూ.3 వేల నగదు ఎత్తుకెళ్లిన ఘటన కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని బృందావన్ కాలనీ (Brindavan Colony)లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
బాధితుల కథనం ప్రకారం.. పాల్వంచ మండలం (Palvancha Mandal) భవానిపేట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న శ్రీ రేఖ బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటికి తాళం వేసి దేవునిపల్లి గ్రామంలో ఉంటున్న తల్లి వద్దకు వెళ్లింది. తిరిగి గురువారం ఉదయం 6 గంటలకు ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉండడంతో ఆందోళనకు గురైంది. ఇంటి లోపలికి వెళ్లి చూడగా దుస్తులు, వస్తువులు చిందరవందరగా పడి ఉండటం, బీరువా తెరిచి ఉండడంతో చోరీ జరిగినట్టు భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ పోలీసులు, సీసీఎస్ పోలీసులు (CCS Police) ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.