అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Election Campaign | కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) పరిధిలోని దేవునిపల్లి (Devunipalli) గ్రామంలో ప్రచారం జోరుగా సాగుతోంది. 10వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి నీలం కళావతి రమేష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
Kamareddy Election Campaign | డప్పు కళాకారులతో కలిసి..
వార్డులో డప్పు కళాకారులతో ఆదివారం వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఉదయం నుంచి కళాకారులతో ప్రభుత్వ పథకాలు, వార్డు అభ్యున్నతికి తయారు చేసిన ప్రత్యేక మ్యానిఫెస్టోను పాటల ద్వారా ఓటర్లకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు (government welfare schemes), ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేస్తానని ప్రజలకు అర్ధమయ్యే విధంగా కళాకారులతో పాటల ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి కళావతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థిగా పదో వార్డులో కౌన్సిలర్‌గా మొదటిసారి పోటీ చేస్తున్నట్టు తెలిపారు.
ఉన్నత విద్యనభ్యసించి రాజకీయాల్లోకి..
ఉన్నత విద్యనభ్యసించిన తాను రాజకీయ కుటుంబం నుంచి వచ్చానని కళావతి తెలిపారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రజలు ఓటు వేయడం ద్వారా వార్డు అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. ముఖ్యంగా పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించాలని ప్రజలు అడుగుతున్నారని, తనను గెలిపిస్తే అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు, ఇళ్లు కచ్చితంగా మంజూరు చేయిస్తానని తెలిపారు. సీసీ రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థను (Drainage system) బాగు చేయిస్తానన్నారు. వీధి దీపాలు, విద్యుత్ స్తంభాలు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు ల్యాప్‌టాప్ అందజేస్తానని, ప్రజలకు మెరుగైన వైద్యం సకాలంలో అందేలా వార్డు ప్రజల కోసం ప్రత్యేకంగా అంబులెన్స్ ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. సమస్యల తక్షణ పరిష్కారం, వార్డు అభివృద్ధి అధికార పార్టీ అభ్యర్దితోనే సాధ్యమన్నారు. ఇతర పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి జరగదని, నిధులు వచ్చే అవకాశం ఉండదన్నారు. ప్రజలు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, అభివృద్ధి చేసి చూపిస్తానని స్పష్టం చేశారు.
