అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy College Land Dispute | కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Govt Degree College) ఆస్తుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత పదేళ్లుగా ఈ అంశం రాజకీయ ఆరోపణలకు అస్త్రంగా మారుతూనే ఉంది.
మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ అంశం మరింత జఠిలంగా మారడంతో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆరోపణల వరకు వెళ్లింది. తాజాగా ఈ ఆరోపణలు నిరూపిస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని ఎమ్మెల్యే ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ అంశం రాజకీయాల నుంచి అధికారుల వైపు మళ్లడంతో ఉత్కంఠ నెలకొంది. సోమవారం నాటికి పరిస్థితులు ఎలా మారతాయి అనే చర్చ సాగుతోంది.
Kamareddy College Land Dispute | ముదురుతున్న వివాదం
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించిన ఆస్తుల అంశం రాజకీయ మలుపులు తిరిగింది. ఈ అంశం కామారెడ్డి జిల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. శనివారం నాటి ఘటనతో అసలు కామారెడ్డి పట్టణంలో ఏం జరుగబోతుంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఎమ్మెల్యేపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నేరుగా ఆరోపణ చేయడం, దానికి ఎమ్మెల్యే రమణారెడ్డి (MLA KVR) దీటుగా బదులివ్వడంతో ఇద్దరి మధ్య ప్రత్యక్ష వైరానికి దారి తీసింది. దాంతో కామారెడ్డిలో రాజకీయం మరోసారి హాట్ హాట్‌గా మారింది.
Kamareddy College Land Dispute | తగ్గేది లేదంటున్న ఎన్ఎస్యూఐ నాయకుడు
మున్సిపల్ ఎన్నికల అనంతరం కళాశాల ఆస్తుల షబ్బీర్ అలీ మాట్లాడారు. అనంతరం ఈ వ్యవహారంలోకి ఎన్ఎస్యూఐ (NSUI) జిల్లా అధ్యక్షుడు సందీప్ వచ్చారు. దీంతో కళాశాల ఆస్తుల అంశం ఎమ్మెల్యే వర్సెస్ సందీప్‌గా మారింది. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ అంశంపై నిజానిర్దారణ కోసం ఎమ్మెల్యే సమయం ఇవ్వడం, నేరుగా సందీప్‌కు ఫోన్ చేసి చర్చకు రావాలని ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారాయి.
సవాళ్లు.. ప్రతి సవాళ్లు
ఎమ్మెల్యే సవాల్‌కు సందీప్ సైతం అదే స్థాయిలో సమాధానం చెప్పారు. ఖచ్చితంగా చర్చకు వస్తానని బదులివ్వడంతో పాటు కాంగ్రెస్ నాయకులంతా చర్చకు శిశుమందిర్ వద్దకు వెళ్లడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఎమ్మెల్యేను గృహ నిర్బందం చేశారు. కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్దకు వచ్చి హల్చల్ చేయడంతో కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కలెక్టర్ చెంతకు..
ఉద్రిక్త పరిస్థితుల అనంతరం కళాశాల ఆస్తుల విషయంలో నేరుగా కలెక్టర్ (Collector) వద్దనే కూర్చుందామని, ఆధారాలతో రావాలని ఎమ్మెల్యే మరోసారి సవాల్ చేశారు. దాంతో కళాశాల ఆస్తుల అన్యాక్రాంతం అంశం ఇప్పుడు కలెక్టర్ వద్దకు చేరింది. సోమవారం ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆదివారం కూడా ఇటు ఎమ్మెల్యే, అటు ప్రభుత్వ సలహదారు ఇళ్ల వద్ద పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.
రాజీనామా చేస్తా
తన కుటుంబంపై వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఆస్తుల విషయంలో తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. దాంతో కళాశాల ఆస్తుల విషయంలో అధికారులు ఎలా స్పందిస్తారు.. తప్పు ఎవరిదో తేలుస్తారా.. లేక ఈ అంశం ఇంకా కొనసాగుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎమ్మెల్యే సమాధానం చెప్పాల్సిందే!
కళాశాల ఆస్తులు అన్యాక్రాంతంపై నేరుగా నాటి కమిటీ సభ్యుడిగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేను సూటిగా ప్రశ్నించామని ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు అన్నారు. ఆధారాలన్ని తమ దగ్గర ఉన్నాయని చెప్పారు. సోమవారం కలెక్టర్ వద్దకు వస్తామని, ఏ సమయానికి రావాలి అనేది ఇంకా చెప్పలేదన్నారు. తమ ప్రశ్నలకు ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
