అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Civil Supplies | కలెక్టరేట్లోని సివిల్ సప్లై కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆదివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి వరకు కొనసాగిన తనిఖీలలో అనేక లోపాలు బయటపడ్డాయి. ఈ మేరకు ఏసీబీ అధికారులు వివరాలను వెల్లడించారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
Kamareddy Civil Supplies | మిల్లర్లపై మొక్కుబడి చర్యలు..
- 2021-22 ఖరీఫ్ సీజన్లో 39 మంది మిల్లర్లు డిఫాల్ట్ అయ్యారు. కానీ, ఇద్దరు మిల్లర్లపైనే చర్యలు తీసుకున్నారు. ఇక ధాన్యం విషయానికి వస్తే.. 581 మెట్రిక్ టన్నుల లోటు ఏర్పడింది. దీని విలువ రూ.64 లక్షలు ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.
- 2022-23 ఖరీఫ్ సీజన్లో 37 మంది మిల్లర్లు డిఫాల్ట్ కాగా, మళ్లీ ఇద్దరు మిల్లర్లపైనే చర్యలు తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. తద్వారా 19,529 మెట్రిక్ టన్నుల లోటు ఏర్పడింది. దీని విలువ రూ.41 కోట్లు ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
- 2023-24 ఖరీఫ్ సీజన్లో 7 మంది మిల్లర్లు డిఫాల్ట్ కాగా, ముగ్గురు మిల్లర్లపై చర్యలు తీసుకున్నారు. దీనివల్ల 5,194 మెట్రిక్ టన్నుల లోటు ఏర్పది. దీని విలువ రూ.2.5 కోట్లు.
- 2023-24లో గ్రీన్ హిల్స్ ఆగ్రో ఇండస్ట్రీస్ కస్టమ్ మిల్డ్ రైస్‌పై డిఫాల్ట్ చేసింది. దీంతో ఈ సంస్థపై క్రిమినల్ కేసు నమోదైంది. అయినా కూడా అధికారులు ఖరీఫ్, రబీ 2024-25 దిగుబడిని అదే మిల్లరుకు కేటాయించారు.
- సెప్టెంబర్ 2025 నుంచి ఇప్పటి వరకు కామారెడ్డి ఎంఎల్ఎస్ పాయింట్లు, బియ్యం మిల్లులను జిల్లా పౌర సరఫరా అధికారి, పౌర సరఫరాల కార్పొరేషన్ జిల్లా మేనేజర్ తనిఖీలు చేయలేదని గుర్తించారు.
Kamareddy Civil Supplies | చర్యలకు సిఫార్సు..
జిల్లా పౌర సరఫరా కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉన్న ఒకరు అనుమానాస్పద లావాదేవీలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు.. ప్రస్తుతం అతనిపై విచారణ జరుగుతోందని వెల్లడించారు. ఇంత పెద్ద మొత్తంలో లోపాలు ఉన్నప్పటికీ డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై జిల్లా పౌర సరఫరా అధికారి, జిల్లా మేనేజర్, డిప్యూటీ తహశీల్దార్లు చర్య తీసుకోవడంలో విఫలమయ్యారు. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు గణనీయమైన నష్టం వాటిల్లిందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. సంబంధిత అధికారులపై అవసరమైన చర్యలకు సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు వెల్లడించారు.