అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Chairperson | కామారెడ్డి బల్దియా రాజకీయం ఉత్కంఠ చివరి దశకు చేరుకుంది. ఛైర్పర్సన్ కోసం ప్రయత్నాలు చేసిన ప్రధాన పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయని తెలుస్తోంది. మూడు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెర పడినట్టుగా కనిపిస్తోంది. కామారెడ్డి బల్దియా ఛైర్పర్సన్గా స్వతంత్ర అభ్యర్థిని ఎంపిక చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనికోసం పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
Kamareddy Chairperson | ఛైర్పర్సన్గా ఇప్ప ఉమారాణి!
కామారెడ్డి బల్దియాలో 49 వార్డులుండగా ఏ పార్టీకి కూడా ఛైర్పర్సన్ సరైన మెజారిటీ ఫిగర్ దక్కలేదు. కాంగ్రెస్ 19, బీజేపీ 16, బీఆర్ఎస్ 11 స్థానాలు దక్కించుకోగా ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులు గెలిచారు. అయితే ఫలితాల అనంతరం ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులు కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో కాంగ్రెస్ బలం 22 కు చేరింది. మరో ముగ్గురు మద్దతిస్తే ఛైర్పర్సన్ పీఠం కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. దానికోసం ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతు అవసరం కాగా క్యాంపుల వేదికగా రాజకీయాలు కొనసాగాయి.
బీఆర్ఎస్ మద్దతు కోసం కాంగ్రెస్ ముఖ్య నేతలు చేయని ప్రయత్నాలు లేవు. అయితే కాంగ్రెస్ నుంచి ఛైర్పర్సన్ అభ్యర్థి ఎవరనేది తెలిస్తేనే మద్దతుపై స్పష్టత వస్తుందని భావించారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్లో చేరిన ఇప్ప ఉమారాణి పేరును తెరపైకి తెచ్చారు.
మున్సిపల్ అధికారిక వర్గాల లెక్కల ప్రకారం ఇప్ప ఉమారాణి స్వతంత్ర అభ్యర్థిగా రికార్డుల్లో నమోదై ఉంటుంది. ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తిగా ఆమె పేరును తెరపైకి తేవడంతో మద్దతు ఇవ్వడానికి బీఆర్ఎస్ ముందుకు వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది.
Kamareddy Chairperson | మారిన రాజకీయ సమీకరణలు
క్యాంపుల వేదికగా కామారెడ్డి బల్దియా రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీలోకి నలుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేరారన్న ప్రచారం జరగడంతో.. తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని వీడియో విడుదల చేశారు. దీంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్కు మద్దతివ్వడం కుదరదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగింది.
ఈ క్రమంలో నాయకులు తమ మేధస్సుకు పదును పెట్టినట్టుగా తెలుస్తోంది. స్వతంత్ర అభ్యర్థి ఇప్ప ఉమారాణి పేరును తెరపైకి తెస్తే ఏ పార్టీకి నష్టం జరగదని భావించినట్టుగా సమాచారం. బీఆర్ఎస్ కూడా తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వలేదని, స్వతంత్ర అభ్యర్థికే మద్దతిచ్చామని చెప్పుకొనే అవకాశం ఉంటుందని ప్లాన్ చేసినట్టుగా ప్రచారం సాగుతోంది.
Kamareddy Chairperson | క్యాంపు నుంచి మున్సిపల్ కార్యాలయానికి
ఎన్నికల ఫలితాల అనంతరం నేరుగా క్యాంపునకు తరలిన మూడు పార్టుల కౌన్సిలర్లు నేడు ఉదయం 11:30 వరకు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఛైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థికి పూర్తిస్థాయి మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయంలో ఛైర్పర్సన్ ఎన్నిక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందుగా కౌన్సిల్ సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం ఛైర్పర్సన్,వైస్ ఛైర్మన్ ఎంపిక చేపట్టి అనంతరం వారి చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు.