అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మరోసారి విమర్శలు చేశారు. కేసీఆర్ హయాంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డట్లు ఆరోపించారు.
జాగృతి జనంబాటలో భాగంగా కవిత సూర్యాపేటలో మాట్లాడారు. ఊరు మధ్యలో కట్టాల్సిన సూర్యాపేట కలెక్టరేట్‌ను (Suryapet Collectorate) ఊరు అవతల కట్టారన్నారు. సూర్యాపేటకు మూడు కిలోమీటర్ల దూరంలో, ప్రైవేట్ వెంచర్లో కలెక్టరేట్ కార్యాలయం నిర్మించారన్నారు. రూ.25 లక్షలకు ఎకరా చొప్పున 25 ఎకరాలు తీసుకొని నిర్మాణం చేపట్టారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా భూములు నష్టపోయిన రైతులకు ఇంత పెద్ద ఎత్తున పరిహారం ఇవ్వలేదన్నారు. ఆ వెంచర్ వరకు ప్రభుత్వ సొమ్ముతో రోడ్డు వేశారన్నారు. సూర్యపేట జగదీశ్‌రెడ్డి (Jagadish Reddy) స్పెషల్ కావడంతో పరిహారం ఎక్కువ వచ్చిందని ఎద్దేవా చేశారు.
MLC Kavitha | విచారణ చేపట్టాలి
కలెక్టరేట్ కట్టిన అనంతరం జగదీశ్‌రెడ్డి స్నేహితులు ఇన్వాల్వ్ అయి వెంచర్‌ను 500 ఎకరాలకు డెవలప్ చేశారన్నారు. దీంతో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందన్నారు. రియల్ ఎస్టేట్ కోసమే అక్కడ కలెక్టరేట్ కట్టారని ఆరోపించారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి స్నేహితులు కావడంతో దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టడం లేదన్నారు. కలెక్టరేట్ నిర్మాణ సమయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. దీనిపై విచారణ చేపట్టి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
MLC Kavitha | కస్టం మిల్లింగ్ స్కామ్
సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో రూ.వెయ్యి కోట్ల కస్టం మిల్లింగ్ స్కామ్ జరిగిందని కవిత పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఈ కుంభకోణంలో నిందితులు ఇప్పటికి దర్జాగా తిరుగుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆయన అనుచరులు కర్నాల చెరువును ఆక్రమించి వెంచర్ చేశారన్నారు. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.