అక్షరటుడే, వెబ్డెస్క్ : Kavitha MPTC Elections | రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తెలిపారు. ఏ గుర్తు అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు.
సంత్ సేవాలాల్ (Sevalal) జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి (Telangana Jagruti) కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో కవిత పాల్గొన్నారు. భోగ్ బండార్ నిర్వహించి, సేవాలాల్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్, పలువురు బంజారా పూజారులు, జాగృతి బంజారా నాయకులు పాల్గొన్నారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జాగృతి పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
Kavitha MPTC Elections | మున్సిపల్ ఎన్నికల్లో..
మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి పోటీ చేసిన విషయం తెలిసిందే. జాగృతి నాయకులు పలువురు ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ గుర్తుపై పోటీ చేశారు. ఆ పార్టీ పలు స్థానాల్లో విజయం సాధించింది. ఈ క్రమంలో పరిషత్ ఎన్నికల్లో సైతం బరిలో ఉంటామని ఆమె తెలిపారు. త్వరలో రాజకీయ పార్టీ ఏర్పాటుకు కవిత సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో పోటీ ద్వారా జాగృతి బలం ఏమిటో ఆమె చూపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాల ఆధారంగా ఆమె పార్టీ ఏర్పాటుపై ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. ఇప్పటికే జాగృతి జనంబాట కార్యక్రమం ద్వారా కవిత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా జాగృతి నాయకులకు అనుభవం వస్తుందని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది.