HomeతెలంగాణKalthi Kallu | క‌ల్లు కాద‌ది.. గ‌ర‌ళం.. త‌ర‌చూ వెలుగులోకి క‌ల్తీ ఘ‌ట‌న‌లు

Kalthi Kallu | క‌ల్లు కాద‌ది.. గ‌ర‌ళం.. త‌ర‌చూ వెలుగులోకి క‌ల్తీ ఘ‌ట‌న‌లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Kalthi Kallu | హైద‌రాబాద్‌లో క‌ల్తీ క‌ల్లు తాగి ఆరుగురు మృతి చెందిన ఘ‌ట‌న రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపింది. ఈ నేప‌థ్యంలో క‌ల్తీ క‌ల్లు బాగోతం మ‌రోమారు తెర‌పైకి వ‌చ్చింది. త‌ర‌చూ ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నా ప్ర‌భుత్వం మొద్దునిద్ర వీడ‌క పోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. గ‌తంలో క‌ల్తీ క‌ల్లు కాటుకు ప‌లువురు మృతి చెందారు. మ‌రికొంద‌రు వింత వింత‌గా ప్ర‌వ‌ర్తిస్తూ ఆస్పత్రుల‌ పాల‌య్యారు. ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న‌ప్ప‌టి నుంచి ఇలాంటి ఉదంతాలు బ‌య‌ట ప‌డుతున్నా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో ప్ర‌భుత్వాలు విఫ‌ల‌మ‌య్యాయి. గ‌తంలో నిజామాబాద్‌, బాన్సువాడలలో క‌ల్తీ క‌ల్లు(Kalthi Kallu) క‌ల‌క‌లం రేపిన‌ప్పుడే పాల‌కులు త‌గిన విధంగా స్పందించి ఉంటే ఇవాళ హైద‌రాబాద్‌లో ఆరుగురు మృత్యువాత ప‌డే వార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Kalthi Kallu | క‌ల్లు పేరిట కాల‌కూటం..

రాష్ట్రంలో స్వ‌చ్ఛ‌మైన క‌ల్లు దొర‌క‌డం గ‌గ‌న‌మై పోయింది. ఒక‌ప్పుడు పుష్క‌లంగా ఉన్న ఈత‌, తాటి చెట్లు త‌గ్గిపోయాయి. ప‌డావు భూములు వ్య‌వ‌సాయ భూములుగా మార‌డం, ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల విస్త‌ర‌ణ‌తో పాటు ర‌హ‌దారుల వెడ‌ల్పు వంటి కార‌ణాల‌తో చెట్ల‌ను న‌రికేశారు. ఈ నేప‌థ్యంలో స్వ‌చ్ఛ‌మైన క‌ల్లు దొర‌క‌డం లేదు. ఇందుకు ఈత‌, తాటి చెట్లు త‌గ్గిపోవ‌డం ఓ కార‌ణం కాగా, త‌క్కువ క‌ల్లుతో ఎక్కువ మొత్తంలో క‌ల్లు త‌యారు చేసి లాభాలు పొందేందుకు విరివిగా ర‌సాయ‌నాలు వినియోగిస్తుండ‌డం మ‌రో కార‌ణం. కొంద‌రు క‌ల్లు డిపోల నిర్వాహ‌కులు ఆల్ఫ్రాజోలం(Alprazolam), డైజోఫాం(Diazoform), క్లోరోహైడ్రేట్‌(Hydrochloride) వంటి మ‌త్తు ప‌దార్థాల‌ను క‌లుపుతూ ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్నారు. మ‌రోవైపు, స్వ‌చ్ఛ‌మైన క‌ల్లు దొర‌క‌ని త‌రుణంలో ప్ర‌జ‌లు కూడా క‌ల్తీ క‌ల్లుకు అల‌వాటు ప‌డిపోయారు. ఆ క‌ల్లు తాగ‌క‌పోతే వింత వింతగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

Kalthi Kallu | గ‌తంలోనూ క‌ల్తీ ఘ‌ట‌న‌లు

క‌ల్లులో క‌లుపుతున్న ర‌సాయ‌నాలు ప్ర‌జ‌ల ప్రాణాలను బ‌లిగొంటున్నాయి. తాజాగా హైద‌రాబాద్‌(Hyderabad)లో క‌ల్తీ కాటుకు ఆరుగురు మృత్యువాత ప‌డ్డారు. మ‌రో న‌లుగురు, ఐదుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. గ‌తంలోనూ ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో క‌ల్తీ క‌ల్లు ఘ‌ట‌న‌లు క‌ల‌క‌లం రేపాయి. గ‌త ఏప్రిల్ నెల‌లో బాన్సువాడ డివిజన్‌లో కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్తతకు గురికావడం ఆందోళ‌న రేకెత్తించింది. నస్రుల్లాబాద్‌ మండలంలోని అంకోల్‌, అంకోల్‌ క్యాంపు, దుర్కితో పాటు బీర్కూర్‌ మండలంలోని దామరంచ గ్రామంలో కల్తీ కల్లు తాగి 50 మందికి ఆస్ప‌త్రుల పాల‌య్యారు. గ‌తంలో నిజామాబాద్ జిల్లాలోనూ క‌ల్తీ క‌ల్లు ఘ‌ట‌న‌లు వెలుగు చూశాయి.

Kalthi Kallu | పాల‌కుల అండ‌దండ‌లు..

క‌ల్తీ క‌ల్లు మాఫియా(Kalthi Kallu Mafia) విచ్చ‌ల‌విడిగా రెచ్చిపోతోంది. డ‌బ్బుల యావ‌లో నిషేధిత ర‌సాయాన‌ల‌తో క‌ల్లు త‌యారు చేసి విక్ర‌యిస్తోంది. వారిచ్చే మామూళ్ల‌తో పాల‌కులు, అధికారులు ప‌ట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాజ‌కీయ నేతల అండదండలు, ఎక్సైజ్‌ సిబ్బంది ఉదాసీనతతో కల్తీ కల్లు మాఫియాకు అడ్డే లేకుండా పోయింది. రాష్ట్రంలో కల్తీ కల్లు ఏరులై పారుతున్నా ఎక్సైజ్‌ శాఖ(Excise Department) క‌న్నెత్తి చూడ‌డం లేదు. హైద‌రాబాద్‌, న‌స్రుల్లాబాద్ వంటి ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు హ‌డావుడి చేయ‌డం, ఆ త‌ర్వాత మిన్న‌కుండి పోవ‌డం సాధార‌ణ‌మై పోయింది.