అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్ విచారణ నివేదికను గురువారం ప్రభుత్వానికి సమర్పించింది. కమిషన్ విచారణ గడువు నేటితో ముగియనుంది. ఈ క్రమంలో మరో మూడు రోజులు గడువు పొడిగిస్తారని ప్రచారం జరిగింది. అయితే కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్(Commission Chairman PC Ghosh) గడువులోగా తుది నివేదికను అందించారు. గురువారం ఉదయం ఆయన నివేదికను నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు (Rahul Bojja) సమర్పించారు. ఆయన దానిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు (Ramakrishna Rao) అప్పగించనున్నారు.
Kaleshwaram Commission | సుదీర్ఘ విచారణ
కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయాని కాంగ్రెస్, బీజేపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ పేరిట కేసీఆర్ కుటుంబం రూ.కోట్లు కొల్లగొట్టిందని ఆరోపించాయి. ఈ క్రమంలో 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. కొన్ని పియర్స్ దెబ్బతిన్నాయి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో కూడా సమస్యలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ ఛైర్మన్‌గా కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) ఏర్పాటు చేసింది. దాదాపు 15 నెలల పాటు విచారణ జరిపిన కమిషన్ తాజాగా నివేదిక సమర్పించింది.
Kaleshwaram Commission | 115 మందిని విచారించిన కమిషన్
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అక్రమాలు, డిజైన్ మర్పు, నిధుల విడుదల, తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీ మార్పు ఎందుకు చేశారని కమిషన్ విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకంగా వ్యవహరించిన అధికారులను ప్రశ్నించింది. దాదాపు 115 మందిని కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ విచారించారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ను సైతం కమిషన్ ప్రశ్నించింది. వారందరి వాంగ్మూలాలు రికార్డు చేసింది. ఈ మేరకు తుది నివేదికను సిద్ధం చేసి ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ సమర్పించారు.