అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్ నివేదిక సోమవారం ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలుస్తోంది. కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ (PC Gosh) ఆదివారం హైదరాబాద్ (Hyderabad)కు చేరుకున్నారు. ఇప్పటికే విచారణ ప్రక్రియ పూర్తవడంతో ఆయన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం. ఒకేవేళ ఆయన నివేదికను సమర్పిస్తే వచ్చే కేబినెట్ (Cabinet) సమావేశంలో ప్రభుత్వం దానిని ప్రవేశ పెట్టనున్నట్లు తెలిసింది. ఇప్పటికే విద్యుత్ సంస్థల్లో అక్రమాలపై జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందింది.
Kaleshwaram Commission | సుదీర్ఘంగా విచారణ
గోదావరి నీటిని ఎత్తిపోసి సాగునీరు అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ (BRS) హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) నిర్మించారు. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భారీగా అక్రమాలు జరిగాయని కాంగ్రెస్, బీజేపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు మేడిగడ్డ వద్ద బ్యారేజీ కుంగిపోయింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిరుపయోగమని కాంగ్రెస్, బీజేపీ పేర్కొన్నాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ వేసింది. సుదీర్ఘంగా విచారణ చేపట్టిన ఈ కమిషన్ ఎట్టకేలకు నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం.
Kaleshwaram Commission | కేసీఆర్, మాజీ మంత్రులు, అధికారుల విచారణ
కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్ట్‌లో కీలకంగా వ్యవహరించిన అధికారులను విచారించింది. దాదాపు 200 మంది అధికారులను కమిషన్ విచారించింది. అయితే అధికారులు అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు నడుచుకున్నామని చెప్పడంతో మాజీ సీఎం కేసీఆర్ (KCR), మాజీ మంత్రులు హరీశ్‌రావు (Harish Rao), ఈటల రాజేందర్ (Etala Rajender)ను సైతం కమిషన్ విచారించింది. కమిషన్ గడువు మేలోనే ముగిసినా వారి విచారణ కోసం ప్రభుత్వం రెండు నెలలు పొడిగించింది. దీంతో కాళేశ్వరం నిర్మాణ సమయంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఈటల రాజేందర్, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, కేసీఆర్‌ను కమిషన్ విచారించింది. కేబినెట్ నిర్ణయం మేరకు ప్రాజెక్ట్ నిర్మించినట్లు ఈటల, హరీశ్‌రావు తెలిపారు. అందరి వాదనలు రికార్డు చేసిన కమిషన్ నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దానిని రేపు ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది.