అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kaleshwaram Commission | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం కమిషన్ గడువును మరో మూడు రోజులు పొడిగించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project)లో అక్రమాలు, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై విచారణకు ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ గడువు మే 31తోనే ముగిసింది.
Kaleshwaram Commission | వారి విచారణ కోసం..
కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) దాదాపు 200 మంది అధికారులను విచారించింది. కీలకంగా వ్యహరించిన ఇంజినీరింగ్ అధికారులను పలుమార్లు విచారించింది. అయితే ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు తాము నడుచుకున్నామని అధికారులు తెలిపారు. దీంతో అప్పటి మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR), మాజీ మంత్రులు హరీశ్‌రావు(Harish Rao), ఈటల రాజేందర్ ను విచారించాలని కమిషన్ నిర్ణయించింది. దీంతో మే 31తో ముగియాల్సిన కమిషన్ గడువును ప్రభుత్వం రెండు నెలల పాటు పొడిగించింది.
Kaleshwaram Commission | నిబంధనలకు విరుద్ధంగా నిధుల విడుదల
కమిషన్ జూన్‌లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్(Eatala Rajender), నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును విచారించింది. అన్ని నిర్ణయాలు కేబినెట్లో చర్చించి తీసుకున్నట్లు వారు తెలిపారు. వీరిని బీఆర్కే భవన్(BRK Bhavan)లో కమిషన్ బహిరంగంగా విచారించింది. అనంతరం మాజీ సీఎం కేసీఆర్ సైతం విచారణకు హాజరయ్యారు. అయితే ఆయన అనారోగ్య కారణాలతో బహిరంగా విచారణ కాకుండా ఫేస్ టు ఫేస్ విచారణకు హాజరయ్యారు.
కమిషన్ ముఖ్యంగా తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ(Medigadda)కు ప్రాజెక్ట్‌ను ఎందుకు మార్చారు, డిజైన్ మార్పు వెనక కారణం ఏమిటి, నిధులు ఎలా విడుదల చేశారనే వివరాలు సేకరించింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా అధికారులు నిధులు విడుదల చేసినట్లు కమిషన్ గుర్తించింది.
Kaleshwaram Commission | 400 పేజీలతో నివేదిక
కాళేశ్వరం కమిషన్ 400 పేజీలతో తుది నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ రోజుతో కమిషన్ గడువు ముగియనుంది. అయితే నివేదికను ఫైనల్ చేసి ప్రభుత్వానికి అందించనుంది. దీనికోసం మరో మూడు రోజులు గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఐఏఎస్ అధికారులు, ఇంజినీర్ల మధ్య సమన్వయలోపం ఉందని కమిషన్ పేర్కొంది. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని ప్రస్తావించింది. పూర్తిస్థాయి అనుమతులు లేకుండానే డిజైన్లు మార్పు చేసినట్లు కమిషన్ గుర్తించింది.
Kaleshwaram Commission | అసెంబ్లీలో ప్రవేశ పెట్టే యోచన
కాళేశ్వరం కమిషన్ తన తుది నివేదికను మూడు రోజుల్లో సమర్పించనుంది. అనంతరం దీనిని అసెంబ్లీలో ప్రవేశ పెట్టి చర్చ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో రూ.లక్ష కోట్ల ప్రజాధనం వృథా అయిందని, కేసీఆర్ కుటుంబం కమీషన్ల కోసమే దీనిని నిర్మించారని కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీలో చర్చ పెట్టి బీఆర్ఎస్ను ఎండగట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కాళేశ్వరంలో అక్రమాలపై చర్చ జరిగితే కాంగ్రెస్‌కు లాభం చేకూరుతుందని ఆ పార్టీ భావిస్తోంది.