అక్షరటుడే, హైదరాబాద్: Kaleshwara Commission : ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం పితామహుడిగా, కాళేశ్వరం ప్రాజెక్టు రూపకర్తగా పేరొందిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(Former Chief Minister BRS chief KCR).. ఇప్పుడదే ప్రాజెక్టు విషయంలో విచారణకు హాజరు కానున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh Commission) కమిషన్ ఇటీవల కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం విచారణకు హాజరు కానున్నారు. కమిషన్ ముందు కేసీఆర్ ఏం చెబుతారనే దానిపైనే ఇప్పుడందరి దృష్టి నెలకొంది. విచారణలో ఆయన నోరు విప్పుతారా? తన రక్తం, మెదడు ధారపోసి కాళేశ్వరం నిర్మించానని ఇన్నాళ్లు చెప్పుకున్న కేసీఆర్.. ఇప్పుడు కూడా ఆ మాటకు కట్టుబడి ఉంటారా? ఇదే విషయాన్ని కమిషన్ ముందు చెబుతారా? లేక నాటి కేబినెట్ మీటింగ్ మేరకే నిర్ణయాలు తీసుకున్నామని చెబుతారా? అన్న దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Kaleshwaram Commission : అంతా ఆయన కనుసన్నల్లోనే..
కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది కేసీఆర్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చాలాసార్లు చెప్పుకున్నారు. తన మెదడునంతా రంగరించి ఈ విశ్వవిఖ్యాత ప్రాజెక్టును నిర్మించామని పలుమార్లు మీడియా ఎదుటే వెల్లడించారు. అయితే, కేసీఆర్ ఇప్పుడదే కాళేశ్వరం విషయంలో విచారణ ఎదుర్కొంటుండడం చర్చనీయాంశమైంది. దశల వారీగా ఎత్తిపోస్తూ సముద్ర మట్టం నుంచి 600 మీటర్ల ఎత్తుకు నీటిని తరలించేలా రూపొందించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మొత్తం అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే జరిగింది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో గుండెకాయ లాంటి మేడిగడ్డ బరాజ్ కు పగుళ్ల రావడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులపై సందేహాలు నెలకొన్నాయి. అంతకు ముందు నుంచే కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి జరుగుతోందని, అది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని ప్రధాని మోదీ(Prime Minister Modi) సహా అందరూ విమర్శలు ఎక్కుపెట్టారు.
Kaleshwaram Commission : నేడు కమిషన్ ముందుకు..
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం అంశంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. దాదాపు ఏడాదికి పైగా విచారణ జరిపిన కమిషన్.. మొదట్లో అధికారులు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లను పిలిచి విచారించింది. వారి నుంచి వాంగ్ములాలు సేకరించిన కమిషన్.. రాజకీయ నేతలను విచారిస్తోంది. ఇప్పటికే అప్పటి మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావును విచారించింది. కాగా.. పీసీ ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్ బుధవారం విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏం చెబుతారన్న దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రాజెక్టు నిర్మాణానికి స్థల ఎంపిక, బరాజ్ లు, కాలువలు, టెండర్లు, పనుల నిర్వహణ సహా మొత్తం వారి కనుసన్నల్లోనే జరిగిందని ఇప్పటికే కమిషన్ ఎదుట హాజరైన వివిధ శాఖల అధికారులు వాంగ్ములం ఇచ్చారు. ఇదే లైన్ లో కేసీఆర్ కూడా మాట్లాడుతారా.. లేక ఏదైనా కొత్త అంశాన్ని తెరపైకి తెస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో ఎవరిని దోషులుగా తేలుస్తారు.? ఎవరిపై ఎలాంటి చర్యలు ఉంటాయన్నది చర్చనీయాంశమైంది.