అక్షరటుడే, వెబ్‌డెస్క్ : HILT Policy | రాష్ట్ర రాజకీయాల్లో హిల్ట్ పాలసీ దుమారం రేపుతోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పాలసీతో వేల ఎకరాల భూముల కుంభకోణానికి తెర లేపారని బీఆర్ఎస్ (BRS) ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. రూ.5 లక్షల కోట్ల విలువైన భూములు కాజేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కుట్ర చేశారని కేటీఆర్ ఆరోపించారు.
ఈ వ్యవహారంపై తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) హైకోర్టులో పిటిషన్ వేశారు. హిల్ట్ పాలసీతో ప్రభుత్వ భూములు నాయకుల బినామీల పేర్లకు మీదకు వెళ్తున్నాయని ఆయన ఆరోపించారు. మంత్రి పొంగులేటి (Minister Ponguleti) కుమారుడు 70 మందితో వెళ్లి కొ భూమిని కబ్జా చేశారన్నారు. పాల్ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. 9,292 ఎకరాల భూ కేటాయింపుల విషయంలో రూపొందించిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని పాల్ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై సీబీఐ, ఈడీతో దర్యాప్తు చేయించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను డిసెంబర్ 29కి వాయిదా వేసింది.
HILT Policy | పాలసీ చుట్టూ రాజకీయాలు
పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) వేళ హిల్ట్ పాలసీ జీవో బయటకు రావడంతో ప్రభుత్వం తల పట్టుకుంటుంది. 9 వేలకు పైగా ఎకరాల భూమిని ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉన్నవారికి కట్టబెట్టాలని చూస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు నగరంలోని పారిశ్రామిక వాడలను సందర్శిస్తున్నారు. తాజాగా కేఏ పాల్‌తో పాటు మరో వ్యక్తి సైతం ఈ వ్యవహారంపై పిటిషన్ వేయడంతో కోర్టుకు చేరింది.
