అక్షరటుడే, వెబ్‌డెస్క్: UttarPradesh | ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా (Bareilly District)లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తొమ్మిదేళ్ల పాటు ప్రేమించుకుని, పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న ఓ యువతి చివరికి తన భర్తను కుటుంబ సభ్యుల సహకారంతో హత్య చేయడం తీవ్ర సంచలనంగా మారింది.
ఆన్లైన్ జూదం కారణంగా భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదమే ఈ ఘోరానికి దారితీసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, జితేంద్ర ఐవీఆర్ఐలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తుండగా, అతని భార్య జ్యోతి రోడ్డు రవాణా సంస్థలో కండక్టర్‌గా పనిచేస్తోంది. ఇటీవల జితేంద్ర తన భార్య బ్యాంక్ ఖాతా నుంచి రూ.20,000 తీసుకుని ఆన్లైన్ గేమింగ్ (Online Gaming)లో పోగొట్టాడు.
UttarPradesh | ఎంత దారుణం..
ఈ విషయంపై జనవరి 26న దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవ తర్వాత కోపంతో ఊగిపోయిన జ్యోతి తన తల్లిదండ్రులు, సోదరుడిని ఇంటికి పిలిపించినట్లు సమాచారం. అనంతరం జరిగిన పరిణామాలు షాకింగ్‌గా మారాయి. జ్యోతి తండ్రి కాళీచరణ్, తల్లి చమేలీ, సోదరుడు దీపక్ కలిసి జితేంద్ర చేతులు, కాళ్లు కదలకుండా పట్టుకున్నారని పోలీసులు తెలిపారు. అదే సమయంలో జ్యోతి తన భర్త గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. హత్య అనంతరం నిందితులు ఘటనను ఆత్మహత్యలా చూపించేందుకు ప్రయత్నించారు. మృతదేహాన్ని మఫ్లర్‌తో కిటికీ గ్రిల్‌కు వేలాడదీశారు. అయితే జితేంద్ర సోదరుడికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం నిర్వహించిన పోస్ట్‌మార్టం నివేదికలో గొంతు నులిమి హత్య చేసినట్లు స్పష్టమైంది.
దీంతో కేసు మలుపు తిరిగింది. విచారణలో జ్యోతి తన నేరాన్ని అంగీకరించగా, పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె తల్లిదండ్రులు కాళీచరణ్, చమేలీని కూడా అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న సోదరుడు దీపక్ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, ప్రేమ వివాహం ఇలా దారుణ ముగింపునకు దారి తీసిన తీరు అందరినీ కలచివేసింది.