అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Justice Sudarshan Reddy | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండి కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి గురువారం నామినేషన్ వేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge), రాహుల్ గాంధీ(Rahul Gandhi), సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కె.సి.వేణుగోపాల్, ఎన్‌సీపీ-ఎస్పీ అధినేత శరద్ పవార్, శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్, డీఎంకే ఎంపీ తిరుచ్చి ఎన్.శివ తదితరులు వెంట రాగా, ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
ఉప రాష్ట్రపతి (Vice President) పదవి కోసం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌తో (CP Radhakrishnan) సుదర్శన్‌రెడ్డి పోటీ పడుతున్నారు. రాజ్యాంగ విలువలపై నిబద్ధత, వినయభావంతో తాను నామినేషన్ దాఖలు చేశానని సుదర్శన్‌రెడ్డి (Justice Sudarshan Reddy) తెలిపారు. తన జీవితం ప్రజాస్వామ్య సంప్రదాయాలతో ముడి పడి ఉందన్న ఆయన.. ప్రతి వ్యక్తి గౌరవంపైనే భారత్ వాస్తవ శక్తి ఆధారపడి ఉంటుందన్నారు.
ఆరోగ్య సమస్యల కారణంగా జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. సెప్టెంబర్ 9వ జరుగనున్న ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా రాధాకృష్ణన్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఇండి కూటమి తరఫున సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డిని ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచారు. జూలై 1946లో జన్మించిన జస్టిస్ రెడ్డి, మే 2, 1995న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. డిసెంబర్ 5, 2005న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జనవరి 12, 2007న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన జూలై 8, 2011న పదవీ విరమణ చేశారు. 2013 మార్చిలో గోవాకు మొదటి లోకాయుక్తగా నియమితులైన జస్టిస్ రెడ్డి వ్యక్తిగత కారణాలతో ఏడు నెలల్లోనే రాజీనామా చేశారు.