అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Trap | ఏసీబీ అధికారులు (ACB Officers) దూకుడు పెంచారు. అవినీతి అధికారుల ఆట కట్టిస్తున్నారు. లంచాల పేరిట ప్రజలను వేధిస్తున్న అధికారులను పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే ఏసీబీ అధికారులు మూడు కేసులు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. అయితే ఏసీబీ అధికారులు దాడులు చేపడుతున్నా.. లంచాలకు మరిగిన అధికారులు మాత్రం భయపడటం లేదు.
వికారాబాద్ (Vikarabad) కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ (Junior Assistant)గా పనిచేస్తున్న కె సుజాత లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జిల్లాలోని నవాబ్‌పేట (Nawabpet) మండలానికి చెందిన ఓ మహిళకు ప్రభుత్వం రెండు ఎకరాల భూమి అందించింది. అయితే ఆ భూమి అందించడానికి సదరు మహిళా పేరు చేర్చడంతో పాటు, కలెక్టర్ ఆదేశాలను నవాబ్‌పేట తహశీల్దార్ కార్యాలయానికి పంపడానికి జూనియర్ అసిస్టెంట్ సుజాత రూ.15 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో సదరు మహిళ కుమారుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు మంగళవారం లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు సుజాతను అరెస్ట్ చేశారు.
ACB Trap | రిటైర్డ్ ఉద్యోగి నుంచి..
లంచాలకు మరిగిన అధికారులు ప్రజలతో పాటు ఉద్యోగులను వదలడం లేదు. మంచిర్యాల (Mancherial) జిల్లాలో ఓ విశ్రాంత ఉద్యోగికి పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (DA)లు చెల్లించడానికి లంచం డిమాండ్ చేసిన వ్యక్తిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదుధారునికి సంబంధించిన బకాయిలో ఉన్న రెండు కరువు భత్యపు బిల్లులను సిద్ధం చేసి వాటిని కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (Kotapalli PHC)లోని డీడీవోకు సమర్పించడానికి కోటపల్లి పీహెచ్సీ ఇన్‌ఛార్జి, అంగరాజుపల్లి పీహెచ్సీ జూనియర్ అసిస్టెంట్ గడియారం శ్రీనివాసులు రూ.6 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో మంచిర్యాలలోని ఓ హోటల్లో డబ్బులు తీసుకుంటుంగా శ్రీనివాసులును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అలాగే పెద్దపల్లి సర్వేయర్ (Surveyor)ను సైతం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
ACB Trap | లంచం ఇవ్వొద్దు
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
