అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే (NDA) కూటమి భారీ విజయం సాధించడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. బీహార్ (Bihar)లో సుపరిపాలన, అభివృద్ధి విజయం సాధించిందన్నారు. బీహార్ ప్రజలు రికార్డు స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొని తమ కూటమికి భారీ విజయం అందించారన్నారు.
బీహార్‌లో జంగిల్‌రాజ్ పాలనను ప్రజలు తిరస్కరించారని ప్రధాని పేర్కొన్నారు. మళ్లీ ఎప్పటికీ జంగిల్ రాజ్ రాదన్నారు. జంగిల్ రాజ్ పాలనలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. ఆ సమయంలో దోపిడీ, అక్రమాలు, హింసాను ప్రజలు అనుభవించారని గుర్తు చేశారు. దీంతో వికసిత్ భారత్ (Vikasit Bharat)కు ఓటు వేశారని మోదీ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో సంక్షేమం, సామాజిక న్యాయం విజయం సాధించినట్లు ఆయన తెలిపారు. బీహార్ తీర్పు నూతన సంకల్పంతో పని చేయడానికి శక్తినిచ్చిందన్నారు. అవిశ్రాంతంగా పని చేసిన ప్రతి ఎన్డీయే కార్యకర్తకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షాల అబద్ధాలను తమ కార్యకర్తలు తిప్పికొట్టారని కొనియాడారు.
PM Modi | రికార్డులు బద్దలు కొట్టారు
బీహార్ ప్రజలు అన్ని రికార్డులు బద్దలు కొట్టారని ప్రధాని అన్నారు. తాము ప్రజలకు సేవకులం.. వారి మనసులు గెలుచుకున్నామని చెప్పారు. బీహార్‌లో ఇవాళ ప్రతీ ఇంట మఖానా పాయసం వండుకుని సంతోషిస్తారని ప్రధాని చెప్పారు. భవిష్యత్తులో రాష్ట్రం అపూర్వమైన వృద్ధిని సాధిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. బీహార్‌లో యువ ఓటర్లు ఎస్ఐఆర్ ప్రక్రియను సమర్థించారని ప్రధాని తెలిపారు. ఈ విజయంతో ఎన్నికల సంఘంపై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు.
PM Modi | ఆయనకు అంకితం
ఎన్డీఏపై విశ్వాసం చూపిన ప్రజలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయాన్ని జేపీ నారాయణ్‌కు అంకితం ఇస్తున్నట్లు చెప్పారు. నితీష్ నేతృత్వంలో అద్భుత విజయం సాధించామన్నారు. జమ్మూ, ఒడిశాలో గెలిచిన బీజేపీ అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు.
PM Modi | కాంగ్రెస్‌పై విమర్శలు
ప్రధాని తన ప్రసంగంలో కాంగ్రెస్ (Congress)పై విమర్శలు చేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ఎంఎంసీగా మారిందన్నారు. ఎంఎంసీ అంటే ముస్లిం మావోలవాది కాంగ్రెస్ అని పేర్కొన్నారు. ఆ పార్టీ చాలా రాష్ట్రాల్లో కనుమరుగు అయిందని మోదీ సెటైర్లు వేశారు. కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ దేశాన్ని పాలించిందన్నారు. అయితే ఆ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందని మోదీ పేర్కొన్నారు. బీహార్ విజయం బెంగాల్లో గెలుపునకు బాట వేసిందన్నారు. రానున్న ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ (West Bengal)లో జంగిల్ రాజ్‌ను తొలగిస్తామన్నారు.
