అక్షరటుడే, పెద్ద కొడప్గల్: Saudagar Gangaram | జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం (Saudagar Gangaram) సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ప్రాథమిక సభ్వత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని తన నివాసంలో శనివారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సౌదాగర్ గంగారాం మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం తనను గుర్తించకుండా కొత్త వ్యక్తి తోట లక్ష్మీకాంతారావుకు (Thota Lakshmikantharao) టికెట్ ప్రకటించిందన్నారు. దీంతో తాను బీఆర్ఎస్కు మద్దతు తెలపడంతో కాంగ్రెస్ పార్టీ తనను సస్పెండ్ చేసిందన్నారు. తాను వెంటనే బీజేపీలో చేరానన్నారు.
Saudagar Gangaram | కాంగ్రెస్ను తిట్టలేక..
అయితే బీజేపీ నాయకులు ఏ కార్యక్రమానికి కూడా తనను పిలవకపోవడంతో మనస్థాపానికి గురవుతున్నట్లు తెలిపారు. బీజేపీ కార్యక్రమాలకు హాజరు కావాలని ఉన్నప్పటికీ తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని (Congress party) తిట్టేందుకు మనసు ఒప్పక కార్యక్రమాలకు దూరంగా ఉండేవాడినని పేర్కొన్నారు. అలాగే బీజేపీకి సైతం పూర్తి న్యాయం చేయలేకపోతున్నానని అందుకు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Saudagar Gangaram | 1978లో మొదటిసారి..
1978లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచానని.. దీంతో 1983లో రెండోసారి కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందన్నారు. ఆనాడు మద్నూర్ సభలో ఇందిరాగాంధీ నన్ను ఆశీర్వదించడంతో రెండోసారి సైతం విజయం సాధించానన్నారు. అలాగే 1989, 2004లో సైతం ప్రజలు నన్ను ఆదరించడంతో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని ఆయన గుర్తు చేశారు. నేను జుక్కల్ ప్రాంతానికి సేవ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తానన్నారు. కొన్ని సందర్భాల్లో రాజకీయంగా ఇబ్బందులు వచ్చినప్పటికీ తట్టుకుని నిలబడ్డానన్నారు. 1999లో కూడా టికెట్ రాకుంటే తనను చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ కాంగ్రెస్ పార్టీని వీడలేదని వివరించారు. అదే విధంగా వెంకయ్య నాయుడు నన్ను ఎన్నోసార్లు బీజేపీలోకి రమ్మంటే కూడా వెళ్లలేదన్నారు. ప్రస్తుతం బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించారు.