అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bandi Sanjay | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌ల్లో పాల్గొని హామీల వర్షం కురిపిస్తున్నారు. అలాగే ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సైతం రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. అయితే బీజేపీ నుంచి ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) మాత్రమే ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. మిగతా నేతలు అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. అయితే బీజేపీ ఫైర్ బ్రాండ్, కేంద్ర బండి సంజయ్‌తో (Bandi Sanjay) గురువారం బోరబండలో సమావేశం నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.
Bandi Sanjay | అనుమతి ఇచ్చి..
బోరబండలో బండి సంజయ్ మీటింగ్‌కు పోలీసులు మొదట అనుమతి ఇచ్చారు. అయితే తాజాగా వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం మీటింగ్ జరగాల్సి ఉండగా.. అనుమతి రద్దు చేయడంపై పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి ఇచ్చి రద్దు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం బోరబండలో మీటింగ్ జరిపి తీరుతామని బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నారు.
Bandi Sanjay | మీటింగ్‌పై ఉత్కంఠ
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో (Jubilee Hills Constituency) మైనారిటీ ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఆ వర్గాన్ని ఆకట్టుకోవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఎంఐఎం మద్దతు తీసుకున్న కాంగ్రెస్ అజారుద్దీన్ (Azharuddin) మంత్రి పదవి కూడా ఇచ్చింది. మరోవైపు బీఆర్ఎస్ సైతం మైనారిటీ ఓట్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో బండి సంజయ్ సమావేశం పెడితే.. హిందువుల ఓట్లు పోలరైజ్ అయ్యే అవకాశం ఉంది. దీంతోనే ప్రభుత్వం ఆయన సమావేశానికి అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే అనుమతి లేకున్నా.. బండి సంజయ్ మీటింగ్ పెట్టి తీరుతామని బీజేపీ నాయకులు ప్రకటించడంతో సాయంత్రం ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
